ఒక్క యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ శివధర్ రెడ్డి.. రక్తదానం చేయడం వల్ల పలు రకాలుగా రక్తం ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి యేటా 4 సార్లు బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సమాజంలో రోడ్డు ప్రమాదాలలో గాయపడే వారికీ రక్తం అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక ఏడాదిలో 8 వేల మంది చనిపోయారని..వారిలో రక్తం లేక చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో ఒక శాతం రక్తాన్ని దానం చెయ్యడంలో ప్రజలందరూ ముందుండాలన్నారు. రక్తదానం చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించారని డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను అభినందించారు. గతంలో కోవిడ్ సమయంలో సైబరాబాద్ సీపీ గా సజ్జనార్ ప్రజలకు అందించిన సేవలను డీజీపీ కొనియాడారు.
నగరంలో అన్ని జోన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. 9 క్యాంప్స్ ద్వారా 3,500 యూనిట్స్ టార్గెట్ పెట్టుకొని శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. బ్లడ్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. ప్రజలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, ఎమర్జెన్సీలో ఆపరేషన్ లో బ్లడ్ అవసరం ఉంటుందన్నారు. తల సేమియా వ్యాధితో చాలామంది బాధ పడుతున్నారని..పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బ్లడ్ యూనిట్స్ ను వాళ్లకు అందజేస్తామని తెలిపారు సజ్జనార్.
