Market Rally: భారీ లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. సోమవారం బుల్ జోరుకు కారణాలివే..

Market Rally: భారీ లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. సోమవారం బుల్ జోరుకు కారణాలివే..

Sensex Nifty: కొత్తవారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ జోష్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సూపర్ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఉదయం 10.43 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 570 పాయింట్ల లాభంతో ఉండగా.. నిఫ్టీ 167 పాయింట్లు పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 417 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 460 పాయింట్లు గెయిన్ అయ్యింది. అయితే మార్కెట్లను భారీ లాభాల దిశగా నడిపిస్తున్న వివిధ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

మార్కెట్ల బుల్ జోషుకి కారణాలు.. 
1. ముందుగా భారత మార్కెట్లలో కొత్త ఆశలకు కారణం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలే. అమెరికాలో ఊహించిన దాని కంటే ద్రవ్యోల్బణం తగ్గుదలను చూడటంతో ఈసారి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇదే జరిగితే విదేశీ ఇన్వెస్టర్లకు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి మార్కెట్లు మరింత ఆకర్షనీయ పెట్టుబడిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. అందరి చూపు ప్రస్తుతం అక్టోబర్ 28న జరిగే ఫెడ్ సమావేశాలపై ఉంది. 

2. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కొనసాగుతున్న కొనుగోళ్ల జోరుకూడా భారత మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. ఈనెలలో చాలా రోజుల పాటు విదేశీ మదుపరులు కొనుగోలుదారులుగా నిలిచారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి వికె విజయ్ కుమార్ చెప్పారు. పండక్కి భారీగా వ్యాపారం జరగటంతో పాటు అమెరికా ఇండియా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి కూడా పెట్టుబడి ప్రవాహాలకు కారణంగా ఆయన చెప్పారు. అయితే ఈ క్రమంలో కొంత లాభాల బుక్కింగ్స్ కూడా ఇన్వెస్టర్ల నుంచి చూడొచ్చని చెప్పారు. 

3. ఇక సోమవారం రోజున విదేశీ మార్కెట్ల నుంచి కూడా సానుకూల పవనాలు ఉండటం దేశీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్లను బలోపేతం చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆసియా, సౌత్ కొరియా కోప్సి, జపాన్ నిక్కీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపొజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ లాభాలతో కొనసాగటానికి అమెరికా మార్కెట్ల లాభాల ప్రయాణం కారణంగా వెల్లడైంది. అలాగే అమెరికా చైనాల మధ్య కూడా వాణిజ్య చర్చలు స్టార్ట్ అవ్వటం సానుకూలతకు కారణంగా నిలిచింది.