Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు.. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు.. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

మెగాస్టార్ చిరంజీవి ‘ఫోటోలు లేదా AI కంటెంట్‌ను’ ఉప‌యోగిస్తే.. అది పక్కా క్రైమ్ చ‌ర్య‌గా ప‌రిగ‌ణించ‌బడుతుందని కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించిన సైబర్ నేరుగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపే పనిలో ఉన్నారు. ఇప్పటికే, పలువురిని గుర్తించి, వారికి నోటీసులు అందజేశారు పోలీసులు. 

అయితే, చిరంజీవి సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా తయారుచేసిన ఈ డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్ఫ్‌ చేసిన ఫోటోలు సినీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. అనేక సోషల్‌ మీడియా పేజీల్లో, వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి.. ఇటీవల నగర సీపీ వీసీ సజ్జనార్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును సైతం ఆశ్రయించారు.

టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన కోర్టు.. డిజిటల్ వేదికలపై మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ మార్ఫింగ్‌‌ చేయడంపై కూడా ఆంక్షలు విధించింది. అంతేకాదు ఇప్పటికే చిరంజీవి పేరును, ఫొటోలను దుర్వినియోగం చేసిన ముప్ఫై మందికి నోటీసులు జారీ చేసింది. 

ఇలాంటి డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల తమ ప్రతిష్ట దెబ్బతింటోందని, తమ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లుతోందని ఇప్పటికే పలువురు నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, రజినీకాంత్, నాగార్జున, రష్మిక లాంటి  సినీ ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.