మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ‘ఎర్రచీర’. కారుణ్య చౌదరి, బేబీ సాయి తేజస్విని (రాజేంద్రప్రసాద్ మనవరాలు) లీడ్ రోల్స్‌లో నటించారు. సుమన్ బాబు దర్శకత్వం వహించడంతో పాటు ముఖ్య పాత్రను పోషిస్తూ, ఎన్.వి.వి. సుబ్బారెడ్డితో కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది.
మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ కొత్తగా ఉంది. రిలీజ్ రోజు టికెట్ కొనుక్కుని ఈ సినిమా చూస్తా. ఇలాంటి చిన్న చిత్రాలకు ప్రోత్సాహం లభించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకు కృషి చేస్తున్నారు’ అని చెప్పారు.
నటుడు, దర్శకనిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ ‘కారుణ్య ఈ మూవీకి వన్ మాన్ ఆర్మీ. చిన్నారి సాయి తేజస్విని అద్భుతంగా నటించింది. సినిమా ఎక్కడ బోర్ కొట్టినా టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్’ అని చెప్పారు. అందరినీ అలరించేలా సినిమా ఉంటుందని కారుణ్య చౌదరి చెప్పింది. నిర్మాత సుబ్బారెడ్డి, జయలక్ష్మి ఫిలిమ్స్ వెంకట్రావ్, రైటర్ గోపి, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
