జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో ఏఐ చాట్ బాట్ మన మాటలకు స్పందించడం చూశాం. 2024లో ఏఐ ఫొటోలు, వీడియోలను జనరేట్ చేసింది. ఇప్పుడేమో మనకోసం కిరాణా సామాన్లను ఆర్డర్ చేసి, పేమెంట్స్ చేసేలా ఏఐ డెవలప్ అయ్యింది.
చాట్‌జీపీటీ ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఓపెన్ ఏఐ, ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలైంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో పాటు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాయి. ఇదెలా పనిచేస్తుందంటే.. ముందుగా మనకు కావాల్సిన కిరాణా సామాన్ల లిస్ట్‌ని చాట్‌జీపీటీకి చెప్పాలి.
అది ఆ ప్రొడక్ట్స్ బిగ్‌బాస్కెట్‌లో ఉన్నాయా? లేవా? అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే వాటి ధరలు, క్వాంటిటీని డిస్‌ప్లే చేస్తుంది. లేకపోతే.. ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ గురించి చెప్తుంది. మనం ‘ఓకే’ అంటే ప్రొడక్ట్స్‌ని కార్ట్‌లోకి యాడ్‌చేసి అదే యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేసేస్తుంది. ఈమధ్య యూపీఐ తీసుకొచ్చిన ‘‘రిజర్వ్ పే” ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీని ద్వారా ప్రత్యేకంగా ఒక మర్చంట్ కోసం కొంత ఫండ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ ఫండ్ నుంచి చాట్‌జీపీటీ మర్చంట్‌కు పేమెంట్ చేసేస్తుంది. దీనివల్ల చాలా టైం ఆదా అవుతుంది.
