ఇండియా- ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్‌లను 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించేందుకు భారత్ సిద్ధమైంది. రూ.16.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై ఈ తగ్గింపు తక్షణమే అమలవుతుంది.
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరుపుకునే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) లో భాగంగా యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై టారిఫ్‌లను 110శాతం నుంచి 40శాతానికి తగ్గించేందుకు భారత్ సిద్ధమైంది. 15 వేల యూరోల (దాదాపు రూ.16.30 లక్షల) కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై ఈ తగ్గింపు తక్షణమే అమలవుతుందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
ఈ టారిఫ్‌ను తరువాత దశలవారీగా 10 శాతం వరకు తగ్గించనున్నారని అన్నారు. ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్ -బెంజ్, బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ ఆటోమేకర్లకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. అయితే, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం టారిఫ్ తగ్గింపు మొదటి ఐదు సంవత్సరాల పాటు అమలు కాదు.
మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి ఇండియన్ కంపెనీలు ఇప్పుడిప్పుడే ఈవీ సెగ్మెంట్‌లో పెట్టుబడులు పెంచాయి. లోకల్ కంపెనీలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2025లో ఇండియాలో దాదాపు 44 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో యూరోపియన్ కంపెనీల వాటా 4 శాతం కన్నా తక్కువగా ఉంది. మారుతి సుజుకి, మహీంద్రా, టాటా ఆధిపత్యం కలిగి ఉన్నాయి.
2030 నాటికి ఇండియాలో కార్ల సేల్స్ ఏడాదికి 60 లక్షల యూనిట్లకు చేరతాయని అంచనా. ఇండియా–ఈయూ ఎఫ్‌టీఏపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ డీల్‌తో ఇండియా టెక్స్‌టైల్స్, జ్యువెలరీ వంటి సెక్టార్లు యూరప్‌లో విస్తరించడానికి వీలుంటుంది.
