10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఏఏ బ్యాంకులు ఎఫెక్ట్ అవుతాయంటే..

10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఏఏ బ్యాంకులు ఎఫెక్ట్ అవుతాయంటే..

భారత దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం చాలా కీలకమైనది. దేశ స్వాతంత్ర్యానికి  ముందు బ్యాంకింగ్ వ్యవస్థ  పూర్తిగా పెట్టుబడిదారుల  చేతుల్లో ఉండేది. అవి వారి  సొంత ప్రయోజనాల కోసం మాత్రమే నడిపేవారు. అవి పట్టణాలలో మాత్రమే బ్యాంకుల బ్రాంచిలు ఉండటం వల్ల  గ్రామీణ ప్రజలకు, వ్యవసాయ రైతాంగానికి ఎలాంటి ఆర్థిక సహకారం అందించేవి కావు. 

1967వ  సంవత్సరం నాటికి మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం 60 శాతం వాటాను సమకూర్చేది. అయితే, ఆ రంగానికి బ్యాంకులు ఇచ్చే రుణాలు మాత్రం 0.2 శాతం మాత్రమే ఉండేది. దీన్నిబట్టి  బ్యాంకింగ్ పరిస్థితి ఏవిధంగా ఉండేదో  మనం అర్థం చేసుకోవచ్చు.

దేశంలోని పేద, చిన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల వద్ద,  పెత్తందార్ల వద్ద  అధిక వడ్డీలకు రుణాలు తీసుకునేవారు. 1967లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో 13 జిల్లాల్లో   కనీసం  ఒక్క  బ్యాంకు బ్రాంచ్ కూడా లేదని తేల్చి చెప్పింది. సగటున రెండు లక్షల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉండేది.

ప్రభుత్వ రంగం నిర్వీర్యం
కేంద్రంలో  అధికారంలో  ఉన్న  మోదీ  ప్రభుత్వం శరవేగంగా  ప్రభుత్వ రంగాన్ని  నిర్వీర్యం  చేసేలా   ప్రైవేటు దిశగా  తన  విధానాల్ని  అమలు చేస్తున్నది.  కొన్ని  బ్యాంకులలో  నష్టాలు  ఉన్నవని.. పెద్ద బ్యాంకులుగా మార్చాలని 2019లో  బ్యాంకుల  విలీన ప్రక్రియను  చేపట్టారు.  ప్రస్తుతం 12 బ్యాంకులు  మాత్రమే  ప్రభుత్వరంగ  బ్యాంకులుగా  మిగిలాయి.  ఇందులో  కూడా  49 శాతం  వాటాలను  ప్రైవేట్ కార్పొరేట్  రంగానికి  అప్పజెప్పటానికి నిర్ణయం చేయడమైనది.

2014  నాటికి  బ్యాంకులలో  పారు  బకాయిలు  రూ.18 లక్షల కోట్లు ఉంటే  2014 తర్వాత  కార్పొరేట్  కంపెనీల  మొండి బకాయిలు  రూ. 58 లక్షల  కోట్లకు  పెరిగాయి.  వీటిని వసూలు చేయకుండా ఇప్పటివరకు  మోదీ  ప్రభుత్వం  రూ.18 లక్షల  కోట్లను  మాఫీ  చేయడం  జరిగింది.  ఈనేపథ్యంలో  బ్యాంకింగ్  వ్యవస్థను  పరిరక్షించుకునేలా తగిన రీతిలో  ఉద్యోగులు ఉద్యమించాలి.  బ్యాంకింగ్  వాటాలను   ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ బ్యాంకుల నుంచి  వేలకోట్ల  రూపాయలు అప్పులుగా తీసుకొని  ఎగ్గొడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి. 

ఒప్పందాన్ని అమలు చేయాలని సమ్మె
బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు, కేంద్ర ప్రభుత్వం ద్వైపాక్షిక చర్చల్లో  2015వ  సంవత్సరంలో ఒక  ఒప్పందం  జరిగింది. ఆ ఒప్పందం  జాయింట్ నోట్ ప్రకారం ప్రతినెల  రెండు, నాలుగు శనివారాలను సెలవుగా ప్రకటించగా.. మిగతా రెండు శనివారాలను  సైతం సెలవుగా  ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చి పదేళ్లు గడిచినా ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. 2022-23లో ప్రభుత్వంతో  జరిగిన  చర్చల్లో  సోమవారం  నుంచి  శనివారం  వరకు రోజు వారీ పని గంటలను మరో 42 నిమిషాలకు పెంచి,  మిగిలిన అన్ని శనివారాల్లో సెలవులు ప్రకటించేందుకు అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి  పంపించి  రెండేళ్లు అయినప్పటికీ ఇంకా పెండింగ్​లోనే  ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న  ద్వైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ... జనవరి 27న దేశవ్యాప్త  సమ్మెకు బ్యాంకింగ్ రంగంలో  పనిచేస్తున్న  జాతీయ ఉద్యోగుల,  అధికారుల యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్ సీబీఈ,  ఏఐబీఓఏ,  బీఈఎఫ్ ఐ, ఐఎన్ బీఈఎఫ్,  ఐఎన్ బీఓసీ, ఎన్ ఓబీడబ్ల్యూ, ఎన్​ఓబీఓ, యునైటెడ్  ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్  (యూఎఫ్ బీవో)  పిలుపునిచ్చాయి. భారత దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారని యూనియన్ల నేతలు తెలిపారు. తక్షణమే బ్యాంకు ఉద్యోగుల ఫోరంతో చర్చలు జరిపి ద్వైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేయాలి.

పేదల అభివృద్ధే ధ్యేయంగా..
ఈ నేపథ్యంలో1968-69లో ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులను  జాతీయం చేయాలని  దేశవ్యాప్తంగా వామ పక్ష పార్టీలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దీని ఫలితంగా మొదటి స్టేజిలో 14 బ్యాంకులను, ఆ తరువాత 12 బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. జాతీయకరణ ఉద్యమంలో మొదటిసారిగా బ్యాంకు  ఉద్యోగులు  దేశవ్యాప్తంగా  సమ్మె చేయడంతో  అప్పటినుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల  శాఖలు  గ్రామీణ ప్రాంతాలకు  విస్తరించాయి.

పేదలు, చిన్న రైతులు, చేతి వృత్తుల వారు, వెనుకబడిన వర్గాల వారు, సామాజికంగా వెనకబడి ఉన్న వారందరికీ వివిధ పథకాల ద్వారా రుణ సౌకర్యాలు, సబ్సిడీలు వంటివి కల్పిస్తూ.. పేదరిక  నిర్మూలనలో బ్యాంకులు ఎనలేని సేవలు చేస్తూ వస్తున్నాయి. 1990వ ప్రాంతంలో దేశంలో సరళీకృత ఆర్థిక  విధానాలు అమలు ప్రారంభం అయ్యేవరకు కూడా జాతీయ బ్యాంకులు పేదల అభివృద్ధే  ద్వేయంగా పని చేశాయి. 1991కి పూర్వం వరకు తన వంతు సామాజిక బాధ్యతను బ్యాంకులు చాలా వరకు నెరవేర్చాయి.

ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ  ప్రధాన కార్యదర్శి