మారుమూల గిరిజన ఆవాసాలు, గ్రామాలలో ప్రభుత్వరంగంలో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలల పైన ప్రభుత్వ ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువైంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నపటికీ క్షేత్ర స్థాయిలో అమలుపైన తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం అడుగు అడుగున కనబడుతున్నది. చాలా ప్రాంతాలలోని అంగన్వాడీలు, పాఠశాలలు ఒక పూటకే మూసేసి వెళ్లిపోతున్నారు. ఆయాలు, అటెండర్ల మీదనే వదిలేసి పోతున్న ప్రాథమిక పాఠశాల టీచర్లు ఎందరో ఉన్నారు. గ్రామాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా నడిచే రోజుల్లో కేవలం ఒక పూటకే మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి తమ పొలాలలో వ్యవసాయం చేసుకుంటూ కొంతమంది రెండు వైపులా లబ్ధి పొందుతున్నారు.
ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు పట్టించుకోవడం లేదు. కంచె చేను మేసినట్టుగా పిల్లలకు, బాలికలకు, బాలింతలకు, గర్భిణీలకు అందాల్సిన పోషక ఆహారాన్ని, గుడ్లు, తదితర పదార్థాలను అంగన్వాడీ టీచర్లు, ఆయాలే సొంతం చేసుకుంటున్నా పర్యవేక్షించేవారు లేరు. పేరుకే సూపర్ వైజర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో వారు కనబడరు. సమావేశాలు ఉన్నప్పుడు తప్పితే ఆకస్మిక తనికీలు చేయరు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు ఒక పూటకే మూసేసిన సందర్భంలో గిరిజన ప్రాంతాల్లో పెద్దవారు పనికి వెళ్లడంతో అనేకమంది చిన్నారులు మృత్యువాతపడ్డారు.
చిన్నారుల తల్లి తండ్రులు తమ పిల్లలను పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల పై భరోసాతో వాటిలో వదిలేసి కూలీ, నాలికి వెళ్లిన సందర్భంలో ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది చిన్నారులు ఆడుకుంటూ ఇంటిముందు ఉండే నీటి సంపులో పడి చనిపోయారు. మరికొంత మంది చిన్నారులు వారి తండ్రులు చేనుపై పిచికారీ చేయంగా మిగిలిన రసాయనలను ధాన్యం దాచే గుమ్మి కింద ఉంచిన మందు డబ్బాలలోని మందును తాగే నీరుగా భావించి తాగి చనిపోయారు. ఆటలో పడిపోయి అపాయం ఎదో తెలియక కరెంటు వైరు పట్టుకొని చనిపోయిన చిన్నారులు కొందరు, ఎండ ప్రమాదం అని తెలియక ఆటడుతూ ఎండ దెబ్బ తగిలి మృత్యువు వాత పడ్డ చిన్నారులు మరికొందరు. ఇంత జరుగుతున్న పై అధికారులుగాని, మీడియా దృష్టికిగాని ఈ సంఘటనలు చేరడం లేదు. ఎందుకంటే గ్రామాలలోని పెద్దలు వెంటనే సెటిల్ చేసేస్తారు. ఉన్నత అధికారుల నిరంతరం, ఆకస్మిక తనిఖీలతో పర్యవేక్షిస్తే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా నడుస్తాయి.
- దారావత్ శ్రీను నాయక్,
సామాజిక కార్యకర్త
