భారతదేశ చరిత్ర, సంస్కృతి భూమితోనే ముడిపడి ఉంది. ఈ నేలపై జరిగిన ఎన్నో యుద్ధాలు, ఉద్యమాలు భూమి కోసం జరిగినవే. తెలంగాణ ప్రాంతం భారతదేశ చరిత్రలో భూమి–భుక్తి–విముక్తి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచింది. భూమికోసం పోరాటం, భూదాన ఉద్యమం కూడా ఇక్కడి నుంచే జరిగింది. భూదాన్ ఉద్యమం ఫలితంగా అక్కడక్కడ కొంత నిరుపేదలకు భూములిచ్చారు. కానీ, పేదల కోసం ఇచ్చిన ఆ భూములు నేడు మళ్లీ ఆక్రమణలకు గురవుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో, వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఇందుకు నిదర్శనం. పేదలకు ఇచ్చిన భూదాన్ భూములపై పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడంతో ఒక్కసారిగా వారు నిరాశ్రయులుగా మారారు. వెలుగుమట్లలో 1951 భూదానోద్యమంలో భాగంగా ఏర్పడ్డ భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలోని 32 ఎకరాల భూమిలో పేదలు ఇల్లు కట్టుకున్నారు. భూదాన్ యజ్ఞ బోర్డ్ పరిధిలోని భూములకు చట్టప్రకారం ప్రభుత్వం యజమాని కాదు. పేదలకే చెందుతాయి. కానీ అక్రమ కట్టడాల పేరుతో 700పైగా పేదల ఇళ్లును అధికారులు నేలమట్టం చేశారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తత మొదలైనది. ఈ అంశంపై బీసీ, ఎస్సీ, ఎస్టీల ఉద్యమ సారథి డాక్టర్ విశారదన్ మహారాజ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గళమెత్తారు. వెలుగుమట్ల ఘటనతో రాష్ట్రంలోని అసైన్డ్ భూములు, భూదాన్ భూములపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
నాటి భూదాన్ ఉద్యమం నుంచి..
నాటి భూదాన్ ఉద్యమం నుంచి గత ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ వరకు జరిగిన లబ్ధి అంతంత మాత్రమే. కమ్యూనిస్టు నాయకులు ఈ విషయంలో బహిరంగంగా స్పందించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ విశారదన్, కల్వకుంట్ల కవిత సంయుక్తంగా మూడు రోజుల నిరవధిక దీక్షతో ప్రభుత్వం దిగొచ్చి కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టాలిచ్చింది. ఇదీ ‘మా భూమి’ పోరాటంలో చారిత్రక విజయం. కానీ ఇందులో 311 మందికి మాత్రమే ఇళ్ల స్థలాలిచ్చారు. 101 మందికి ఇళ్లు మంజూరు చేశారు. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల వివక్షత చూపిందని బాధితులు అంటున్నారు.
భూదాన్ ఉద్యమం బూటకమా?
భూదాన్ ఉద్యమం నిజమా? బూటకమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వెలుగుమట్ల ప్రజలు కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడమే ఇందుకు నిదర్శనం. దీంతో అసలు పేదలకు ఇచ్చిన భూములు నిజంగా వారి చేతుల్లో ఉన్నాయా? లేదా కాగితాల మీద మాత్రమే ఇచ్చారా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు కేటాయించిన అసైన్ భూములపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆధిపత్య వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను ఆక్రమిస్తున్నారు. ‘అభివృద్ధి’ పేరుతో పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
పేదలకు చట్టపరంగా పట్టాలివ్వాలి
గాంధీ అనుచరుడైన ఆచార్య వినోబా భావే ఈ ఆలోచనను భూదాన ఉద్యమంగా చేపట్టాడు. అంబేద్కర్ మాత్రం రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా నిరుపేదలకు భూమిని పంచాలన్నాడు. ఈ క్రమంలో భూసంస్కరణ పేరుతో భూ గరిష్ట పరిమితి చట్టాలు చేసినప్పటికీ అమలుకాలేదు. మిగులు భూములు పేదలకు పంచలేదు. నిజంగా పేదలకు భూములు చెందాలంటే ప్రభుత్వం భూదాన్ భూములు, అసైన్ భూములు ఆక్రమణకు గురి కాకుండా చట్టాలు చేయాలి. పేదలకు చట్టపరంగా పట్టాలివ్వాలి. అప్పుడే సామాజిక ఘర్షణలు జరగవు. ఇదే రాజ్యాంగ సామాజిక న్యాయ సూత్రం.
- సంపతి రమేష్,
సోషల్ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
