ప్రతి సంవత్సరం ఆగస్టు 3న భారతదేశంలో జాతీయ అవయవదాన దినోత్సవం నిర్వహిస్తారు. అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం, మరణానంతరం అవయవదానానికి ముందుకు వచ్చేలా సమాజాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, మార్పిడి అవసరమైన ప్రతి రోగికీ అవయవం అందుబాటులో ఉండటం లేదు.
కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పదివేలకు పైగా రోగులు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో కిడ్నీ పూర్తిగా పాడైనవారు డయాలిసిస్‌తో జీవితం గడిపినా కూడా, ఇతర అవయవ వైకల్యం ఉన్నవారు మందులతో కష్టంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కారణం, అవయవ మార్పిడిలో నేడు ప్రధాన సమస్య అవయవాల కొరత.
మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చిన్నపేగు వంటి అవయవాలు తీవ్రమైన అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు జీవించే అవకాశాన్ని కల్పించగలవు. కార్నియా, చర్మం, ఎముకలు, గుండె కవాటాలు వంటి కణజాలాల దానం కూడా అనేకమందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక వ్యక్తి మరణానంతరం చేసే అవయవ, కణజాల దానం ద్వారా పలువురు రోగులకు చికిత్స అందే అవకాశం ఉంటుంది.
అవయవ మార్పిడి చట్టం ఎందుకు అవసరమైంది ?
భారతదేశంలో మూత్రపిండ మార్పిడి అనేక దశాబ్దాలుగా జరుగుతోంది. అయితే ప్రారంభదశల్లో అవయవ దానానికి సమగ్ర చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం, జీవించి ఉన్న వ్యక్తుల నుంచి మూత్రపిండాల కొనుగోలు, మధ్యవర్తుల ప్రమేయం, పేదరికాన్ని ఉపయోగించుకొని జరిగే వాణిజ్య మార్పిడులు వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, బ్రెయిన్‌స్టెమ్ డెత్ అనంతరం అవయవాలను దానం చేసి ఇతరులకు మార్పిడి చేయడానికి స్పష్టమైన చట్టపరమైన గుర్తింపు అవసరమైంది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ అఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ ఆక్ట్ 1994’ను తీసుకొచ్చింది. తరువాత కణజాలాలను కూడా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి, 2011 సవరణలతో ఇది ట్రాన్స్‌ప్లాంటేషన్ అఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్ (THOTA) గా మరింత విస్తృతమైంది. తదనుగుణంగా అనేక నియమాలు కూడా రూపొందించబడ్డాయి.
ఈ చట్టం ఏర్పడిన తర్వాత దేశంలో అవయవ మార్పిడిలో ఒక కొత్త శకం ఆరంభమయ్యింది. ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం చికిత్స కోసం అవయవాలు, కణజాలాలను చట్టబద్ధంగా తొలగించి మార్పిడి చేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేయడం. అదే సమయంలో మానవ అవయవాల వ్యాపారాన్ని నిరోధించడం.
బ్రెయిన్ స్టెమ్ డెత్ అవయవ దానంలో కీలకమైన అంశం
అవయవదానం గురించి మాట్లాడేటప్పుడు బ్రెయిన్ స్టెమ్ డెత్‌ను అర్థం చేసుకోవడం అవసరం. తీవ్రమైన మెదడు గాయం, రక్తస్రావం లేదా ఇతర కారణాల వల్ల మెదడు, ముఖ్యంగా బ్రెయిన్‌స్టెమ్ పనితీరు పూర్తిగా, తిరిగిరానివిధంగా నిలిచిపోవచ్చు.
వెంటిలేటర్ సహాయంతో కొంతకాలం గుండె కొట్టుకుంటున్నప్పటికీ, చట్టబద్ధమైన ప్రమాణాల ప్రకారం నిర్ధారించిన బ్రెయిన్ స్టెమ్ డెత్ అంటే మరణమే. అటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల సమ్మతితో, వైద్య, చట్టపరమైన నియమాలను పాటిస్తూ అవయవాలను దానం చేయవచ్చు. ఈ సమయంలో తీసుకున్న ఒక కుటుంబ నిర్ణయం, అవయవాల కోసం ఎదురుచూస్తున్న పలువురికి జీవించే అవకాశాన్ని అందించగలదు.
‘తోట’ యాక్టు (1994 )తో వచ్చిన మార్పు
తోట యాక్టు ద్వారా బ్రెయిన్‌స్టెమ్ డెత్‌కు చట్టపరమైన గుర్తింపు లభించడం భారతదేశంలో మరణానంతర అవయవ దానానికి కీలకమైన పునాది వేసింది. ఆసుపత్రుల నమోదు, అవయవాల తొలగింపు, నిల్వ మార్పిడికి ప్రమాణాలు, జీవించి ఉన్న దాతల విషయంలో బంధుత్వ నిర్ధారణ, బంధువు కాని దాతల విషయంలో ప్రత్యేక పరిశీలన వంటి రక్షణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. దీనితో అవయవ మార్పిడి ఒక వ్యక్తిగత ఆసుపత్రి పరిధిలో జరిగే ప్రక్రియగా కాకుండా, నియంత్రిత వైద్య-చట్టపరమైన వ్యవస్థలోకి వచ్చింది.
నోట్టో ( NOTTO ) - దేశ వ్యాప్త సమన్వయం
దేశంలో అవయవదానం, మార్పిడి కార్యక్రమాలను సమన్వయం చేయడానికి National Organ and Tissue Transplant Organization (NOTTO) కీలక సంస్థగా పనిచేస్తోంది. దీనికి ప్రాంతీయ స్థాయిలో ROTTOలు, రాష్ట్ర స్థాయిలో SOTTOలు అనుసంధానమై పనిచేస్తాయి.
అవయవాల కోసం ఎదురుచూస్తున్న రోగుల నమోదు, మరణానంతరం లభించిన అవయవాల కేటాయింపులో పారదర్శకత, రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య సమన్వయం, అవయవదానంపై ప్రజలకు అవగాహన, మార్పిడి కార్యకలాపాలకు సంబంధించిన సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాల్లో ఈ వ్యవస్థకు ప్రధాన పాత్ర ఉంది.
భారతదేశం ప్రపంచ పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా అవయవదాన విధానాల్లో గణనీయమైన తేడాలు ఉన్నాయి. స్పెయిన్ వంటి దేశాలు మరణానంతర అవయవదానంలో చాలాకాలంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా జీవన్మృతుల నుండి అవయవాలను సేకరించి మార్పిడికి అందచేసే బలమైన వ్యవస్థగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది.
మన దేశంలో అవయవ మార్పిడి సంఖ్యలు పెరుగుతున్నప్పటికీ, జీవించి ఉన్న దాతల నుంచి జరిగే మూత్రపిండ, కాలేయ మార్పిడుల వాటా ఇప్పటికీ ఎక్కువగా ఉంది. సాధారణంగా తల్లి, తండ్రి, జీవిత భాగస్వామి, సోదరుడు, సోదరి లేదా ఇతర సమీప బంధువులు జీవదాతలుగా ముందుకు వస్తారు.
మరోవైపు, అమెరికా, అనేక యూరోపియన్ దేశాల్లో మరణానంతర దాతల నుంచి లభించే అవయవాలు మొత్తం మార్పిడుల్లో సింహభాగం ఉంటాయి.
దేశాల మధ్య సంఖ్యలను నేరుగా పోల్చేటప్పుడు జనాభా, చట్టాలు, ఆరోగ్య వ్యవస్థ, ఎమర్జెన్సీ సదుపాయాలు, బ్రెయిన్ స్టెమ్ డెత్ గుర్తింపు, ప్రజల అవగాహన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయినప్పటికీ, భారతదేశంలో మరణానంతర అవయవదానం పెరగాల్సిన అవసరం స్పష్టంగా ఉంది.
అవయవదానం అంటే అమ్మకం కాదు
అవయవదానంలో అత్యంత ముఖ్యమైన నైతిక సూత్రం ఇదే. మానవ అవయవాలు వ్యాపార వస్తువులు కాదు. పేదరికంలో ఉన్న వ్యక్తి ఆర్థిక అవసరాన్ని ఉపయోగించుకొని అవయవాన్ని కొనుగోలు చేయడం, డబ్బు కోసం దానం చేయించడం, నకిలీ బంధుత్వ పత్రాలు సృష్టించడం, మధ్యవర్తుల ద్వారా దాతలను సమకూర్చడం వంటి చర్యలు చట్టవిరుద్ధం. ఇవి వైద్యవృత్తిలో కూడా నైతికతకు విరుద్ధం.
తోట చట్టం ప్రకారం మానవ అవయవాల వాణిజ్యం, అక్రమంగా అవయవాల సేకరణ లేదా మార్పిడిలో భాగస్వామ్యం తీవ్రమైన నేరాలు. నేర స్వభావాన్ని బట్టి జైలు శిక్ష, జరిమానా, వైద్యులపై వృత్తిపరమైన చర్యలు వంటి పరిణామాలు ఉండవచ్చు. రెండు కోట్ల జరిమానా, పది సంవత్సరాల కారాగార శిక్ష విధించబడుతుంది. అందువల్ల అవయవ మార్పిడి చేసే ఆసుపత్రులు కూడా చట్టపరమైన అనుమతులు, నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి.
అవయవ అక్రమ రవాణా-దేశ నైతిక వ్యవస్థకు ముప్పు
ఆర్గాన్ ట్రాఫికింగ్ అనేది కేవలం చట్ట సమస్య కాదు. అది మానవ గౌరవానికి సంబంధించిన సమస్య. పేదరికం, నిరక్షరాస్యత, అప్పులు లేదా ఇతర బలహీన పరిస్థితులను ఉపయోగించుకొని ఒక వ్యక్తి అవయవాన్ని వ్యాపార వస్తువుగా మార్చడం సమాజం అంగీకరించకూడదు.
అక్రమ అవయవ వ్యాపారం బయటపడిన ప్రతిసారి ప్రజల్లో చట్టబద్ధమైన అవయవదానంపైనా అనుమానం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి మార్పిడి వ్యవస్థలో పారదర్శకత, దాతకు రక్షణ, గ్రహీతకు సమాన అవకాశం, కేటాయింపులో న్యాయం అత్యంత అవసరం.
మన దేశానికి ఇప్పుడు కావలసింది ఏమిటి ?
భారతదేశంలో అవయవ మార్పిడి వైద్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు మరణానంతర అవయవ దానాన్ని అదే స్థాయిలో పెంచాలి. ప్రతి పెద్ద ఆసుపత్రిలో సంభావ్య బ్రెయిన్‌స్టెమ్ డెత్ దాతలను సకాలంలో గుర్తించడం, నిర్ధారణ ప్రక్రియను సమర్థంగా నిర్వహించడం, శిక్షణ పొందిన ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్స్ అందుబాటులో ఉండటం, కుటుంబాలకు సున్నితంగా, స్పష్టంగా వివరించడం అవసరం. ప్రజల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు రావాలి. అవయవ దానం గురించి కుటుంబంలో ముందుగానే మాట్లాడాలి.
ఒక వ్యక్తి తన మరణానంతరం అవయవ దానం చేయడానికి వీలుగా ముందుగానే ‘డోనార్ ప్లెడ్జి’ చేయడం మంచి నిర్ణయం. అయితే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. మరణానంతర దానం సందర్భంలో కుటుంబంతో పరిస్థితి వివరించి వారి సమ్మతితో మాత్రమే అవయవ దానం ప్రక్రియ మొదలవుతుంది. అవయవ దానం ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. అది వైద్యం, చట్టం, నైతికత, మానవ గౌరవం కలిసే చోట తీసుకునే సామాజిక నిర్ణయం.
ప్రోత్సహించాలి
జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవయవ మార్పిడి అవసరమైన రోగికి ధనం, వైద్య నైపుణ్యం, అత్యాధునిక ఆసుపత్రి అన్నీ ఉన్నా, సరైన అవయవం లభించకపోతే చికిత్స సాధ్యం కాకపోవచ్చు. అందుకే అవయవ దానంపై అన్ని విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఉన్న అపోహలను తొలగించాలి. కుటుంబ సభ్యులందరితో చర్చించాలి.
చుట్టూ ఉన్నవారిని కూడా ప్రోత్సహించాలి. తద్వారా చట్టబద్ధమైన, పారదర్శకమైన అవయవ దాన వ్యవస్థను బలోపేతం చెయ్యాలి. జీవిత కాలంలో మనం ఎందరికో ఎన్నో విధాల సహాయాలు చేసే అవకాశం ఉంటుంది . మరణానంతరం కూడా మరొకరి జీవితం కొనసాగడానికి మనం అవకాశం ఇవ్వగలం. అవయవ దానం ఆ అవకాశానికి ఒక అత్యద్భుతమైన మార్గం.
డాక్టర్ శ్రీభూషణ్ రాజు
సీనియర్ ప్రొఫెసర్,హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ, నిమ్స్
(స్టేట్ జీవన్ దాన్ ట్రస్ట్ నోడల్ ఆఫీసర్ )
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
