ప్రస్తుత విద్యా సంవత్సరం డిగ్రీ కళాశాలల నిర్వహణలో ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పెను సవాళ్లను తీసుకువచ్చింది. ఒకప్పుడు దరఖాస్తులతో కిటకిటలాడిన సాధారణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, నేడు అడ్మిషన్ల కోసం కటకటలాడుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాల ఎంపికలో చూపిస్తున్న ఈ మార్పు, ఉన్నత విద్యావ్యవస్థలో వస్తున్న భారీ మార్పులకు సంకేతం. ఇటీవల దోస్త్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో లక్షలాది సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం.
ఒకవైపు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెరిగినా, డిగ్రీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య మాత్రం తగ్గడం డిగ్రీ కళాశాలల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వ, అటానమస్ కళాశాలల్లో ఇంచుమించు పూర్తిగా సీట్లు భర్తీ అవడం మారుతున్న తల్లిదండ్రుల, విద్యార్థుల వైఖరిని స్పష్టం చేస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ లేదా అటానమస్ కళాశాలలనే విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే, అటానమస్ కళాశాలలు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్నాయి. సాధారణ కళాశాలలతో పోలిస్తే అటానమస్ కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఆశాజనకంగా ఉండటం, కార్పొరేట్ సంస్థల భాగ స్వామ్యం విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. సర్టిఫికెట్ కోర్సులు, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అదనపు శిక్షణను ఇవ్వడం వల్ల విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నారు. బీటెక్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం, డిగ్రీ కోర్సుల పట్ల అనాసక్తికి మరో ప్రధాన కారణం.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారిలో దాదాపు 60% నుంచి 65% మంది విద్యార్థులు ఇప్పుడు బి.టెక్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉండటానికి ఇది కూడా ఒక బలమైన కారణం. 2026 ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నవారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 12% పెరిగింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసినవారిలో దాదాపు 85% మంది బి.టెక్ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. బి.టెక్‌లో సాధారణ కోర్సుల కంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులకు 95% డిమాండ్ ఉంది. ఈ సీట్లు కౌన్సెలింగ్ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే భర్తీ కావడం గమనార్హం.
అటానమస్ కళాశాలల వైపు ఎందుకు ఈ ఆకర్షణ ?
ప్రస్తుతం అటానమస్ హోదా కలిగిన కళాశాలలు విద్యార్థుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. దీనికి గల కారణాలను పరిశీలిస్తే ఈ కళాశాలల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల వేగంగా జరగడం వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం వృథా కాకుండా త్వరగా ఉన్నత విద్యకు లేదా ఉద్యోగాలకు వెళ్లగలుగుతున్నారు. అటానమస్ కళాశాలలు తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి అధ్యాపకుల నియామకంలో అత్యంత కఠినమైన ప్రమాణాలను పాటిస్తున్నాయి.
అటానమస్ సంస్థలు కచ్చితంగా నెట్, సెట్ అర్హత ఉన్నవారికి లేదా పి.హెచ్.డి చేసిన నిపుణులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి. దీనివల్ల విద్యార్థులకు సబ్జెక్టుపై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. అటానమస్ కళాశాలలు తమ అధ్యాపకులకు ఎప్పటికప్పుడు వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ, కొత్త బోధనా పద్ధతులను అలవాటు చేస్తాయి. తద్వారా అధ్యాపకులు విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, వారి కెరీర్ గైడెన్స్‌కు కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇది విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రధాన అంశం.
ప్రైవేట్ కళాశాలల ముందున్న సవాళ్లు
అటానమస్ హోదా లేని సాధారణ ప్రైవేట్ కళాశాలలు మనుగడ సాగించాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి. భోదనను కేవలం డిగ్రీ పుస్తకాలకే పరిమితం చేయకుండా, సాఫ్ట్ స్కిల్స్, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించాలి. స్థానిక పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుని, విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ కల్పించాలి. ల్యాబ్స్, డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీలను ఆధునీకరించడం ద్వారా విద్యార్థులను ఆకర్షించవచ్చు. అనేక చిన్న ప్రైవేట్ కళాశాలలు ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అనుభవంలేని లేదా తక్కువ అర్హతలు కలిగిన సిబ్బందిని నియమిస్తున్నాయి.
ఫలితంగా విద్యార్థులకు సబ్జెక్టుపై లోతైన అవగాహన కల్పించడంలో వీరు విఫలమవుతున్నారు. అధ్యాపకులకు సరైన వేతనాలు అందకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల వారు తరచుగా కళాశాలలు మారుతుంటారు. ఈ అస్థిరత నేరుగా విద్యార్థుల విద్యా ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో లేదా కొత్త సిలబస్‌ను అర్థం చేసుకుని బోధించడంలో అనుభవంలేని అధ్యాపకులు ఇబ్బందిపడుతున్నారు.
నాణ్యమైన విద్యాబోధనే పరిష్కారం
ఉన్నత విద్యారంగంలో ఆరోగ్యకరమైన మార్పు. కేవలం పట్టాల కోసం చదివే రోజులుపోయి, జ్ఞానం, నైపుణ్యం కోసం విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. ఏ కళాశాల అయితే పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతుందో అదే ఈ పోటీ ప్రపంచంలో విజేతగా నిలుస్తుంది. భవిష్యత్తులో అటానమస్, నాణ్యమైన విద్యాబోధన అందించే సంస్థలే అడ్మిషన్ల రేసులో ముందుంటాయి. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు స్వల్పకాలంలో డిమాండ్ ఉన్న కోర్సుల వైపు ఆకర్షితులైతే భవిష్యత్తులో వాటి కాలం చెల్లినప్పుడు సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. కావున ఫుల్ టైమ్ డిమాండ్ ఉన్న
కోర్సులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, కొత్త కోర్సులను అదనపు డిగ్రీ లేదా స్వల్పకాలిక కోర్సులాగ అభ్యసించాలి.
ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉనికిని కాపాడుకోవడానికి కేవలం అడ్మిషన్ల కోసం ఆఫర్లు, నజరానాలు ఇస్తే సరిపోదు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను మార్చడం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారానే విద్యా ర్థులను ఆకర్షించగలవు. అంతేకాదు, ఒక కళాశాల స్థాయిని, దాని భవనాలు లేదా వసతులు నిర్ణయించవు. అక్కడ బోధించే అధ్యాపకులే నిర్ణయిస్తారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు తమ ఉనికిని కాపాడుకోవాలంటే అర్హత కలిగిన, అనుభవం ఉన్న అధ్యాపకులను నియమించుకోవాలి.
డాక్టర్. ఎండి ఖ్వాజా మొయినుద్దీన్ సోషల్ ఎనలిస్ట్
