‘జ్ఞానంపైన పెట్టుబడి అధిక వడ్డీనిస్తుంది’ అంటాడు అమెరికా నిర్మాతల్లో ఒకరైన బహుముఖ ప్రజ్ఞాశాలి బెంజిమన్ ఫ్రాంక్లిన్. కానీ, మన పాలకులకు ఆ సోయి ఉన్నట్టు అనిపించదు. ఏ వర్గాన్ని ఏ చౌకబారు ఎత్తులు, జిత్తులతో ఆకట్టుకొని ఎప్పటికప్పుడు పబ్బం గడిపేద్దామనే సంకుచిత ఆలోచన తప్ప విశాల దృక్పథం మాత్రం శూన్యం. మొత్తం రాజకీయ పార్టీల వైఖరే స్థూలంగా అలా ఉంది. ఈ దేశపు యువత విషయంలో రాజకీయ వ్యవస్థ అనుసరించే విధానాలు, పాటించే ఎత్తుగడలు పదేపదే దీన్నే రుజువు చేస్తున్నాయి.
‘నీట్’ పరీక్ష పేపర్ లీక్ దరిమిలా ఉత్పన్నమైన పరిణామాల్లో విద్యార్థులు, యువతరం ఎంతో పట్టుదలతో ఉద్యమించి అనుకున్న ఫలితం సాధించాక.. రాజకీయ పార్టీలు అందుకున్న జెన్ జీ రాగం తాజా తార్కాణం. పన్నెండేళ్ల పాలనలో ఎప్పడూ లేనిది బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కేంద్ర ప్రభుత్వం బెట్టు చేసి, కడకు మెట్టు దిగింది.
మంత్రి రాజీనామాతో సహా వారి డిమాండ్లన్నింటికీ తలొగ్గాల్సి వచ్చింది. విపక్షాలకు శీర్షభాగాన ఉండి విద్యార్థి-, యువజనోద్యమానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ, ఇదంతా ‘తమ ప్రయోజకత్వం’ అని భ్రమపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి, జెన్- జీ కోసం చట్టసభలకు ప్రవేశ యోగ్యత వయసును 25 ఏళ్ల నుంచి 21కి తగ్గిస్తామంటున్నారు. ‘కాక్రోచ్’ ఉద్యమం పైకి కనిపించే పిసరు తప్ప, కొండంత అశాంతి దేశ యువతరం గుండెల్లో గూడు కట్టుకుందని రాజకీయ పార్టీలు గ్రహిస్తున్నట్టు లేదు. ఆ పొరపాటే అసలు కథ.
యువత అవసరాలను గుర్తించి, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం మనది. దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారున్నారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో... అంటే దాదాపు అంతటా నిరుద్యోగిత శాతం అసాధారణంగా పెరిగి ఉంది. ఉద్యోగ, -ఉపాధి అవకాశాలు లేక, చదువుకున్న నిరుద్యోగ యువతలో అశాంతి తీవ్రస్థాయిలో ఉంది. వారి ఆలోచనా ధోరణిలో అనిశ్చితి ప్రబలంగా ఉన్నది.
ఎప్పుడెలా ఆలోచిస్తారో? దేనికి ఎలా స్పందిస్తారో? అంచనాలకు అందనంత అస్పష్టత నెలకొంది. దీన్ని అడ్రస్ చేసే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిష్కారాన్ని ఏ ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో ఆలోచించటం లేదు. ఎన్నికల సమయంలో ఏవో ఒకటి, రెండు ఆశావహమైన హామీలిస్తున్నా ఆచరణలో ఏమీ ఉండట్లేదు. ఫలితంగా మెజారిటీ జనాభాలో అశాంతి, అసహనం ప్రబలుతోంది. అందుకే రాజకీయ పక్షాలు యువత నుంచి ఎంత త్వరగా వ్యతిరేకత తెచ్చుకోగలవో అంత తేలికగా వారిని అవి మచ్చిక చేసుకోలేకపోతున్నాయి. కులమో, మతమో, జాతీయవాదమో, చట్టసభలకు వయోపరిమితి తగ్గించడమో... ఇలా వారిని ఆకట్టుకునే చౌకబారు ఎత్తుగడలను ఆశ్రయిస్తున్నాయి.
ఎవరి దగ్గర ఏమీ లేదు
ఒక్క పాలకపక్షం అని కాదు. నిజానికి యువతను ఆకట్టుకునే సమగ్ర విధానం, సైధ్దాంతిక నిబద్ధత ఏ పార్టీ వద్దా లేదు. ఎక్కడో విదేశీ నేలపైనున్న భారత టెక్కీ సెటైరికల్‌గా ‘అవును మేం కాక్రోచ్‌లమే’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పిలుపివ్వడం, బీజేపీలా ధ్వనించే ‘సీజేపీ’ని ప్రకటించడం, అదొక ఉద్యమంలా పరిణమించడం తెలిసిందే. జూన్ 6 నుంచి జులై 25 వరకు...49 రోజుల మహోద్యమం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా పుట్టించిన వేడి సెగలు కక్కింది. మేధావులు, ఆలోచనాపరుల మద్దతు తోడవటం, దరిమిలా పార్లమెంట్ మార్చ్‌పై పోలీసుల దాడి రూపంలో పాలకుల దాష్టీకం దేశం కన్నెర్రకు కారణమైంది. ఇది యువత, విద్యార్థి లోకం విజయమే! ఎందుకంటే, అంతదాకా మెట్టుదిగని కేంద్ర ప్రభుత్వం పట్టుదల వీడి రాజీకి వచ్చింది. నిరసనకారుల డిమాండ్లను యధాతథంగా అంగీకరించింది. అనుకున్నది సాధించిన యువశక్తి, ఉద్యమం ముగిసినట్టు ప్రకటించింది.
కాంగ్రెస్‌తో సహా చంకలు గుద్దుకుంటున్న ప్రధాన స్రవంతి పార్టీల యువజన విభాగాలు, విద్యార్థి వింగ్‌ల ఘనత కాదిది. వేర్వేరు కారణాల వల్ల అవన్నీ బలహీనపడి ఉన్నాయిపుడు. సమకాలీన అంశాలపై ఘాటుగా స్పందిస్తూ, ఒకప్పుడు ఎంతో క్రియాశీలకంగా ఉన్న ప్రధాన పార్టీల యువజన, విద్యార్థి విభాగాలు ఇప్పుడు ఉనికి నిలుపుకునే పోరులో ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఆయా పార్టీల వైఖరే! నాయకులు టీషర్ట్, జీన్స్ వేసుకున్నంత మాత్రాన ఆ పార్టీలు యువతరానికి ప్రాతినిధ్యం వహించినట్టవుతుందా? నేటి యువత స్థితిగతులేంటి? వారి అవసరాలేంటి? ఆలోచనాలు ఎలా ఉన్నాయి? సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయి? పరిష్కారాలు ఎలా ఉండాలి? అనికదా రాజకీయ పక్షాలు ఆలోచించాలి? చట్టసభల్లో చర్చపెట్టాలి. ప్రభుత్వాల మెడలు వంచి పరిష్కారాలతో ఫలితాలు రాబట్టాలి. యువతను సంతృప్తిపరచి వారి శక్తి-యుక్తుల్ని దేశాభివృద్ధిలో వాడుకోవాలి. అది జరగడం లేదు.
విద్యా విధానమే భ్రష్టు పడుతోంది
దేశంలో విద్యా విధానమే పూర్వ వైభవం కోల్పోతోంది. బడులు మూతపడుతున్నాయి. ఉన్నత విద్య నాణ్యత ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ రంగంలో విశ్వవిద్యాలయాలను పనిగట్టుకొని బలహీనపరుస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు యూనివర్సిటీలు, మెజారిటీ వృత్తి విద్యా సంస్థలు ఫక్తు వ్యాపారానికి మరిగాయి. పట్టా సర్టిఫికెట్లు లభిస్తున్నాయి తప్ప ఉద్యోగ యోగ్యతలు పెరగడం లేదు. విద్యార్థుల్లోనూ ‘కెరీరిజం’ తప్ప సామాజిక స్పృహ, నైతిక విలువల పట్ల నిబద్దత బలపడటం లేదు. వివిధ స్థాయిల్లో జరుగుతున్న ‘సిలబస్ మార్పు’ ప్రగతిశీలంగా కాకుండా తిరోగమన ప్రేరకంగా ఉంటోంది.
విద్యార్థుల్లో నైతిక విలువల్ని, సామాజిక బాధ్యతని, పర్యావరణ చైతన్యాన్ని వృద్ధి చేసేదిగా ఉండడం లేదు. ఫలితంగా విద్యార్థులు యువతగా పరివర్తినచెందే క్రమంలో వారిలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ, నాయకత్వం చొరవ వంటివి లోపిస్తున్నాయి. వారు ఉద్యోగాలు చేస్తూ నాలుగు రాళ్లు సంపాదించే మర యంత్రాలుగా మారుతున్నారు. ఆ ఉద్యోగాలు, ఉపాధి లభించనపుడు అశాంతికి గురవుతున్నారు.
విద్యావ్యవస్థ పునరుద్ధరణ కోసం ఉద్యమించాలి
అనిశ్చితిలో, అయోమయంలో ఎటుపడితే అటు పరుగులు తీస్తున్నారు. వారి ఉద్రేకం, ఉద్విగ్నతలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. పాలపొంగులా పైకెగసి, సబ్బు నురగలా సద్దుమణిగినా ఆశ్చర్యం లేదు. విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల మనుగడ, ఎన్నికలు లేకపోవడంతో అక్కడనుంచి నాయకత్వం క్రియాశీలకంగా ఎదిగి రావటంలేదు. మానవ శాస్త్రాలకు ప్రాధాన్యత తగ్గి విద్యార్థుల్లో, యువతలో బహుముఖ ప్రజ్ఞ, జిజ్ఞాస సన్నగిల్లాయి.
ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో మానవ హక్కులు, రాజ్యాంగాంశాలు, చైతన్య సదస్సులు, మేధోచర్చలు జరుగుతుంటే విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేది. ఇప్పుడు అటువంటి సభలు, సమావేశాలు తగ్గాయి. అరకొర జరిగేచోట కూడా 50, 60 సంవత్సరాలు పైబడ్డవారు తప్ప యువత, నడివయస్కుల హాజరీ నామమాత్రమే! పేపర్ లీక్‌పైన జరిగినంత ఉద్యమం దేశంలో విధ్వంసమవుతున్న విద్యా వ్యవస్థ పునరుద్ధరణ కోసం జరగాలి.
పాలకుల దృష్టి మారితేనే..
ఆధిపత్యం, అణచివేత తద్వారా సుస్థిర అధికారం కోసం ఎంతకైనా తెగించే పంథాను పాలకులు వీడాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉత్పత్తి, సేవల రంగాల వృద్ధిపై దృష్టిపెట్టాలి. ప్రజాస్వామ్య పద్ధతులు, సంప్రదాయాలకు విలువ ఇస్తూ యువశక్తిని విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలి. నిరసనకు దిగినవారితో చర్చలు, సంప్రదింపులు జరపాలి. ఇంటర్‌నెట్ ఆపి, రైళ్లు నిలిపి, మెట్రో స్టేషన్లు మూసి, ఆందోళనకారులకు నీరు,- ఆహారం అందకుండాజేసి, రాళ్ల లారీని సిద్ధంగా ఉంచి, సివిల్ డ్రెస్ మాఫియాను దింపి, లాఠీలకు మేకులమర్చి దాడి సల్పి, అమ్మాయిల గుడ్డలు చింపి అమానుషంగా వ్యవహరించారు.
ఇటువంటి చర్యలతో ప్రజాగ్రహాన్ని నియంత్రించడం సరికాదని గ్రహించాలి. మన విధానాలు అంతిమంగా ఎలా ప్రతిఫలిస్తున్నాయో ప్రభుత్వాలు బేరీజు వేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మానవాభివృద్ధి, ఆనందం, విద్య, వైద్యం, పర్యావరణం, పత్రికా స్వేచ్ఛ వంటి అంతర్జాతీయ సూచీల్లో 200 ప్రపంచ దేశాలకుగాను భారత్ 120 నుంచి 193వ స్థానాలకు ఎందుకు దిగజారుతోందో బేరీజు వేసుకోవాలి.
రాజకీయ పక్షాలు ఒకర్నొకరు విమర్శించుకోవడం కాకుండా ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఆలకించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణేతలని గ్రీక్ తాత్వికుడు ప్లేటో చెప్పిన గొప్ప మాటలతో ముగిస్తాను. ‘జనం మట్టిలాంటివాళ్లు. నువ్వు ఎదగడానికి ఉపయోగపడతారు. నిన్ను కప్పిపెట్టడానికీ పనికొస్తారు’ అంటాడాయన.
దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
