వెలుగు ఓపెన్ పేజీ : మూసీ అభివృద్ధిపై డొల్ల వైఖరి

వెలుగు ఓపెన్ పేజీ :  మూసీ అభివృద్ధిపై డొల్ల వైఖరి

హైదరాబాద్ నగరంలో  మూసీనది ఉన్న విషయం చాలామందికి తెలియదు.   మూసీ పుట్టిన వికారాబాద్ కొండలు ఆరోగ్యకర వాతావరణానికి పెట్టింది పేరు.  ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు ఇక్కడ కొన్ని రోజులు నివసించి సంపూర్ణ ఆరోగ్యం తిరిగి పొందడం కూడా చరిత్రలో  లిఖితమైనది.  ఇక్కడి నీరు కొండల  మీద నుంచి జాలువారి  గండిపేటలో నిలవ అయ్యి నగరానికి పారిన తరువాత తాగితే జన్మధన్యం  అయినట్లు భావించేవారు. మూసీనది  పరీవాహక ప్రాంతంలో గాలి,  నీరు ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండడంతో ఈ ప్రాంతంలో  నివసించడానికి అందరూ ఇష్టపడేవారు.  మూసీనది నీరు, గాలి ఆరోగ్యకరంగా ఉండడానికి ఇక్కడి ప్రకృతి కారణం.   గాలి, నీరు,  ప్రకృతి కలగలిపిన  ఆరోగ్యకర  వాతావరణం హైదరాబాద్ నగరానికి ప్రాణం అందించింది.  అయితే,  గత 35 సంవత్సరాల నుంచి  క్రమంగా ఈ వాతావరణం మారిపోయింది.  మూసీనది మురికినీటికి ఆలవాలం అయ్యింది. 

ఈ వికృత పరిస్థితి క్రమంగా ఎగబాకి జంట జలాశయాలను దాటి ఇప్పుడు  వికారాబాద్  కొండల వరకు చేరింది.  పరిస్థితి ముందే ఊహించి జంట జలాశయాలను కాపాడడానికి అప్పుడు నగర పౌరులు పూనుకుని 1995లో జీవో 111 తీసుకువచ్చారు.  దీని అమలుకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సహకరించలేదు.  ఆశ్చర్యంగా తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా పూనుకుని గత 12 ఏండ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయ పూనుకున్నారు.  తమ వ్యక్తిగత,  వ్యాపార,  రాజకీయ, ఆర్థిక  ప్రయోజనాల కోసం వికారాబాద్ కొండల నుంచి హైదరాబాద్ నగరం వరకు ఉన్న ఆహ్లాదకర ప్రకృతిని ధ్వంసం  చేస్తున్నారు. మొత్తం రాజకీయవేత్తలు, అధికారులు ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని మూసీనదిని  సుందరీకరణ  చేస్తామని  నాటకాలు  ఆడుతున్నారు. మూసీ మురికిగా,  ఇరుకుగా మారడానికి  కారణమైన వర్గాలే  మూసీనదిని  ప్రక్షాళన చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు.  

ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరి

1999లో  మొదలైన మూసీ  సుందరీకరణ నాటకం ఇప్పటికీ కొనసాగుతున్నది.  సుందరీకరణ,  ప్రక్షాళన, పునరుద్ధరణ వగైరా  కొత్త పదాలతో  పాత ఫార్ములానే ప్రజల మీద రుద్దుతూ ప్రకృతిని ఇంకా నాశనం చేస్తున్నారు. ఏ పదం వాడినా ఆఖరుకు వాడేది అభివృద్ధి పేరునే.   మూసీనది  అభివృద్ధి ఎవరి కోసం?  ఎందుకు?  అనే  ప్రాథమిక ప్రశ్నలకు  జవాబు దాటవేస్తూ  అంతర్లీన స్వప్రయోజనాలకు పాలకులు పెడుతున్న పేరు మూసీ  సుందరీకరణ. వీరి ప్రచార హోరు  ఎంత గొప్పదంటే  సామాన్యులతోపాటు మేధావులు కూడా  ఏం చేయాలనే విషయంలో సందిగ్ధంలో పడుతున్నారు.  ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరి, అధికార పక్షాల డొల్ల వైఖరి మధ్య గందరగోళంలో పడుతున్నారు.

జరగాల్సింది ఇలా..

 సరళంగా  చెప్పాలంటే  మూసీకి పునఃవైభవం,  నీరు,  గాలి స్వచ్ఛంగా  ఉండాలంటే  వికారాబాద్  కొండల నుంచి  ప్రకృతి  పునరుద్ధరణ  జరగాలి.  విధ్వంసకర  కార్యకలాపాలకు  స్వస్తి పలకాలి.  నీటి కాలుష్యం నివారించాలి. నది ప్రవాహానికి ఉన్న అడ్డు తొలగించాలి.  మొత్తం నది పరీవాహక ప్రాంతం  కొలమానంగా  పునరుద్ధరణ జరగాలి.  ప్రజలు ఇందులో భాగస్వామ్యులు కావాలంటే ఈ కార్యక్రమం ఆద్యంతం పారదర్శకంగా పెంపొందించాలి.

బఫర్ జోన్​ను  ప్రభుత్వం నిర్ణయించాలి

మూసీనది ఒక ప్రకృతి వనరు.  సామాజిక ఆస్తి.  దీన్ని కొందరు తమ ‘లాభాలకు’ అనువుగా  మలుచుకుంటుంటే  నియంత్రించాల్సిన  ప్రభుత్వం చేష్టలుడిగి చూసింది.  ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా ఈ నదిని రక్షించాలని అనుకోలేదు.  నది వైశాల్యం ప్రభుత్వమో, ప్రైవేటు వ్యక్తులు నిర్ణయించేది కాదు.  నది తన ప్రవాహం బట్టి నిర్ణయిస్తుంది.  మనం చేయాల్సింది అది ఎంతమేరకు ఉన్నది అని కేవలం గుర్తించడమే.  గత  వందేండ్ల ప్రవాహం అధ్యయనం బట్టి ఈ వైశాల్యం, బఫర్ జోన్​ను  నిర్ణయించాలి.  బఫర్ జోన్ అనేది ముందు జాగ్రత్తగా అధిక వర్షాలు వచ్చినప్పుడు పెరిగే  వరదనుబట్టి  ప్రభుత్వం నిర్ణయించాలి. ఈ రెండింటి నిర్ధారణ శాస్త్రీయంగా, ఆధ్యయనం ప్రకారం జరపాలి.  ఆ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాలి.   నదీతీరం వెంబడి నది ప్రవాహం మీద ప్రభావం చూపెట్టే అన్ని రకాల అడ్డంకులను తొలగించాలి.  వీటి నిర్ధారణ బట్టి ఆక్రమణల చిట్టా తయారు అవుతుంది. ఇప్పటికే నిర్ధారించిన ఆక్రమణల చిట్టా ప్రభుత్వం బయటపెట్టాలి. 

వెయ్యి ఎకరాలు ఎందుకు? 

ప్రస్తుత  ప్రభుత్వం  పూనుకున్న గాంధీ  సరోవర్  ప్రాజెక్ట్  మూసీనది  పునరుద్ధరణలో  మొదటి భాగం అని ఊరిస్తున్నది.  దీనికి  కావాల్సిన  పెట్టుబడి ఇచ్చే బ్యాంకులు మాత్రం అప్పు  ఇవ్వడానికి  ఇప్పటికే  ఒప్పుకున్నాయి. వారికి ఇచ్చిన  ప్రతిపాదన ఏంది?  ఇందులో  ప్రధానంగా  విగ్రహం  ఏర్పాటు చేయడం,  నది  ఒడ్డును సిమెంట్​తో  మూయడం,  ఈ పరిమిత  ప్రాంతంలో  మురికినీటిని  ‘శుద్ధీకరణ’ చేయడం.   తద్వారా  వచ్చే విలువను ఉపయోగించుకుని  చుట్టూ  భూములను  అమ్మి సొమ్ము  చేసుకోవడం.  హిమాయత్ సాగర్,  ఉస్మాన్ సాగర్  దిగువన,  భూమిని మార్పిడి చేస్తూ,  కాంక్రీట్ ఒడ్డు నిర్మాణం చేయడం ఇందులో ఉన్న ప్రధాన చర్య.  అయితే  ఆ పరిమిత  నిర్మాణాలకు  దాదాపు  వెయ్యి ఎకరాలు  ప్రభుత్వం  ఎందుకు  తీసుకుంటున్నది?  రక్షణశాఖ  నుంచే కాక  హిమాయత్ సాగర్  దిగువన ఉన్న అనేక ప్రభుత్వ సంస్థల భూమిని కూడా సేకరిస్తున్నారు.   దాదాపు 9 కిలోమీటర్ల  మేరకు ఉండే ఈ ప్రాజెక్టులో  ప్రకృతి  పునరుద్ధరణ ప్రతిపాదనలు లేవు.  ప్రకృతిని,  ప్రకృతి ప్రక్రియలను  ధ్వంసం చేసే నిర్మాణాలు ఉన్నాయి.

వ్యర్థజల శుద్ధీకరణ

మూసీ కాలుష్యానికి మూల కారణం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలు.  ముఖ్యంగా పాత ముంబై రోడ్డు వెంబడి,  పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు వంటి  ప్రాంతాల్లో  ఉన్న  ఫార్మా పరిశ్రమలు వదిలే రసాయన వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఈ పరిశ్రమల వ్యర్థ జల శుద్ధీకరణ కఠినంగా అమలుచేయడం తక్షణ అవసరం.  అదే సమయంలో నగరంలో వెలువడే  మురుగునీటి శుద్ధీకరణ కోసం తగినంత సీవేజ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్లు నిర్మించాలి. ఉన్న ప్లాంట్లు సరిగా పని చేస్తున్నాయా లేదా అని సక్రమంగా తనిఖీ చేయాలి.  ఈ మౌలిక సమస్యలకు పరిష్కారం చూపించకుండా నది ఒడ్డున విగ్రహాలు పెట్టడం, పార్కులు  నిర్మించడం కేవలం నాటకమే అవుతుంది.

వికారాబాద్​ కొండలను సంరక్షించాలి

వికారాబాద్ కొండల సంరక్షణ  మూసీనది పరిరక్షణలో అంతర్భాగం. ఈ రెండింటినీ వేరువేరుగా చూడడం సరికాదు.  వేసవిలో నది పూర్తిగా ఎండిపోవడానికి, వర్షాకాలంలో ఒకేసారి పెద్ద వరదలు రావడానికి కొండలపై అడవులు  నాశనం కావడం  ఒక ముఖ్య కారణం.  కాబట్టి  వికారాబాద్ కొండల సంరక్షణ అంటే ఆ కొండలపై ఉన్న అటవీ భూమిని కాపాడటం,  కొండల చుట్టూ ఉన్న రైతుల వ్యవసాయ భూమిని రక్షించడం, ఆ ప్రాంతంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్,   పారిశ్రామిక ఆక్రమణలను అరికట్టడం.  నాశనమైన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం. ఇవన్నీ కలిపి ఒక సమగ్ర వికారాబాద్ కొండల సంరక్షణ ప్రణాళిక రూపొందించాలి.  వికారాబాద్ కొండలను హైదరాబాద్ నగరపు జలవనరుల పుట్టిల్లుగా గుర్తించి వాటిని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి.

గతంలో ఇచ్చిన అనేక నివేదికలు ఏమయ్యాయి?

మూసీ పునరుద్ధరణ కోసం ఇప్పటికే ఎన్నో కమిటీలు, అధ్యయన బృందాలు నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికలు ఏమి చెప్పాయి? వాటి అమలు ఎంత జరిగింది? ఏ కారణాల వల్ల అమలు జరగలేదు? ఈ ప్రశ్నలకు జవాబులు ప్రజలకు చెప్పే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.  గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం మళ్లీ అదే తప్పులు చేయడమే అవుతుంది. పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణ సక్రమంగా ఉంటే నదిలో రసాయనాలు కలవకుండా ఉంటాయి. నది ఒడ్డున ఆక్రమణలు లేకుండా ఉంటే నది తన సహజ ప్రవాహ మార్గంలో సాగుతుంది.  మూసీ పునరుద్ధరణలో  ప్రజలు తమ బాధ్యతను అర్థం చేసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మూసీ నదిని కాపాడుకోవాలి.

​ కొండల దిగువన పరిశ్రమలకు అనుమతులిచ్చి..
 మూసీ పునరుద్ధరణ గురించి మాట్లాడుతారా?  

 మూసీ పరివాహక ప్రాంతానికి మూలమైన వికారాబాద్  కొండల దిగువ ప్రాంతంలో  తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఏర్పాటు చేస్తున్న రాకంచెర్ల వంటి పారిశ్రామిక కేంద్రాల ప్రాజెక్టులు ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని సృష్టిస్తున్నాయి.  ఒక వైపు మూసీ నది పునరుద్ధరణ గురించి మాట్లాడుతూ,  మరోవైపు మూసీకి ప్రాణాధారమైన ప్రాంతంలో కాలుష్యం చేసే పారిశ్రామిక కేంద్రాలు స్థాపించడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ రెండు విధానాలు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైనవి. 

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​


ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.