ఐటీఐ విద్యార్థులకు రూ.2 లక్షల జీతంతో విదేశీ ఉద్యోగాలు: మంత్రి వివేక్

ఐటీఐ విద్యార్థులకు రూ.2 లక్షల జీతంతో విదేశీ ఉద్యోగాలు: మంత్రి వివేక్

యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా... ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు టాటా సంస్థతో మాట్లాడి స్కిల్స్ నేర్పిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐ ఫిట్టర్, ప్లంబర్ కోర్సులు చేసిన వారిని విదేశాలకు పంపించి, నెలకు 2 లక్షల రూపాయల జీతం వచ్చేలా ప్రభుత్వం తరపున పూర్తి బాధ్యత తీసుకుంటామని... ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం నుంచి విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారిని ప్రభుత్వం తరపున పంపిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందో సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని  మంత్రి వివేక్ స్పష్టం చేశారు. 

సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి వివేక్ ఘాటైన సమాధానాలిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మంత్రి... గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. నాడు కేవలం శిలాఫలకాలు మాత్రమే వేశారని, కానీ వాటికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో కొత్త గోదాములు నిర్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను మంత్రి వివేక్ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. 1970లో ఆ తర్వాత 2012లో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని ఇప్పటికే 50 శాతం ఇళ్లు స్లాబ్ లెవెల్‌కు చేరుకున్నాయని తెలిపారు. సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుతూ... పేదలకు కరెంట్ బిల్లుల భారం తప్పించేందుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 300 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. అలాగే, సిద్దిపేట జిల్లాలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. పాఠశాల పిల్లలకు ఉచిత అల్పాహారం (ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్), ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోరినట్లుగా.. ఈ ప్రాంతానికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేసే విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

 రాబోయే రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా, డీఏపీ కొరత లేదని... ఎకరానికి రెండు బస్తాల చొప్పున సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతన్నలకు మంత్రి వివేక్ భరోసా ఇచ్చారు.