- గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలో కుంభవృష్టి
- తెలంగాణ సహా దక్షిణ రాష్ట్రాల్లో వానలు కరువు
- స్థానిక వాతావరణ పరిస్థితులతోనే ఉత్తరాదిన వర్షాలు
- అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలన్నీ అటువైపే కేంద్రీకృతం
- ఇక్కడి తేమగాలులన్నీ అటువైపే పయనం.. మన దగ్గరున్న రుతుపవన గాలులు కూడా అటే
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎల్నినో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉత్తరాన కుంభవృష్టి పడుతుంటే.. దక్షిణాదిన మాత్రం వానల్లేక పొలాలు బీటలువారుతున్నాయి. అక్కడ ఊర్లకుఊర్లు మునిగిపోతుంటే.. ఇక్కడ చుక్కనీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, అసోంలలో వరదలు పారుతుంటే.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో కనీస తడి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి.
ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తున్న ఎల్నినో.. అక్కడ ప్రభావం చూపకపోవడానికి స్థానిక వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఏర్పడుతున్న వెదర్ సిస్టమ్స్‌పై.. ఎల్నినో కూడా ప్రభావం చూపించబోదని స్పష్టం చేస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న చిన్నపాటి అల్పపీడన ప్రాంతాలు, ఉపరితల ఆవర్తనాలన్నీ అటువైపే ఉండడంతో ఉత్తరాదిన భారీ వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు.
అదే సమయంలో ఇక్కడ ఏర్పడుతున్న వెదర్ సిస్టమ్స్ అన్ని కూడా.. ద్రోణుల ప్రభావంతో అటువైపు మళ్లుతున్నాయని వివరిస్తున్నారు. అందుకే ఇక్కడ మబ్బులుపడుతున్నా వర్షాలు కురవడం లేదని పేర్కొంటున్నారు. ఇక, ప్రస్తుతం పసిఫిక్ ఓషన్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2.1 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయంటున్నారు.
స్థానిక పరిస్థితుల ముందు చిన్నబోతున్న ఎల్నినో
ఉత్తరాదిన స్థానిక పరిస్థితుల ముందు ఎల్నినో చిన్నబోతున్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్లో ఉపరితల ఆవర్తనాలు పదుల సంఖ్యలో ఏర్పడుతున్నాయని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బెంగాల్, ఒడిశా తీరాల్లో అల్పపీడనంగా మారడంతో స్థానికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు బలపడ్డాయంటున్నారు.
రుతుపవన ద్రోణి కూడా అక్కడే కేంద్రీకృతమవడం కలిసివచ్చిందని చెబుతున్నారు. ఈ వెదర్ సిస్టమ్స్వల్ల తేమను గాలులు మోసుకొస్తున్నాయని, బంగాళాఖాతంలో ఉన్న తేమ గాలులను అరేబియా సముద్రంలోకి లాగేస్తున్నాయని చెబుతున్నారు. వాటి ఫలితంగా మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురుస్తున్నదని పేర్కొంటున్నారు. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఎత్తులో ఉండడం, హిమాలయాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు.
హీట్ డోమ్స్‌తో..
ప్రస్తుతం ఉత్తరాదిన వర్షాలు పడుతున్నాయంటే దానికి కారణం.. అంతకన్నా ముందు వేడి పెరిగి తీరప్రాంతాల్లో హీట్డోమ్స్ ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అక్కడ అల్పపీడన ప్రాంతాలు ఏర్పడ్డాయంటున్నారు. ఇప్పుడు కూడా రాజస్తాన్వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. దీంతో అరేబియా, బంగాళాఖాతంలోని వేడిగాలుల్లో ఉన్న తేమను మొత్తం లాగేస్తున్నాయని వివరిస్తున్నారు.
ఆ తేమగాలులు ఒక్కసారిగా ఎత్తుకువెళ్లి ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశాల్లో మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కూడా పైకి వెళ్లి తేమతో కూడిన రుతుపవనగాలులతో కలిసిపోయి వర్షాలకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు పసిఫిక్‌లో వేడినీళ్లు పైస్థాయి, కింది స్థాయి గాలులతో ఒక లూప్ (వాకర్సర్క్యులేషన్)ను ఏర్పాటు చేస్తున్నాయని, అందులో వర్షాలకు కారణమయ్యే పై స్థాయి గాలులు ఇండియావైపు వస్తుండడంతో వర్షాలు పడుతున్నాయంటున్నారు.
వాస్తవానికి ఎల్నినో సందర్భంలో కిందిస్థాయి గాలులు ఎక్కువగా మనదగ్గర వీస్తుంటాయని.. కానీ, ప్రస్తుతానికి మాత్రం ఎగువ స్థాయి గాలులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా న్యూట్రల్‌గా ఉండడంతో కొంచెం అనుకూలపరిస్థితులు ఏర్పడ్డాయని వివరిస్తున్నారు.
మన తేమగాలులన్నీ అటువైపు
తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ తేమగాలులు, రుతుపవన గాలులున్నాయి. కానీ, అవి ఇప్పుడు ఉత్తరాదికి మళ్లాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతానికి కిందిస్థాయి గాలులే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు ఇక్కడ కూడా రెండు మూడు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినా.. అవి కూడా అరేబియా సముద్రంవైపు దిశమార్చుకుని వెళ్లిపోయాయని వివరిస్తున్నారు.
అందుకే మన రాష్ట్రంలోనూ వర్షాలుపడడం లేదని పేర్కొంటున్నారు. మళ్లీ ఏవైనా వెదర్ సిస్టమ్స్ ఏర్పడితే తప్ప తెలంగాణలో వర్షాలు పడే పరిస్థితులు లేవని వివరిస్తున్నారు. ఈ వారానికి తెలంగాణసహా దక్షిణాది రాష్ట్రాల్లో 26 శాతం తక్కువ వర్షాలు పడుతాయని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో ఉత్తరాదిన 5 శాతం, మధ్య భారతంలో 10 శాతం ఎక్కువ వానలు పడతాయని తాజాగా విడుదల చేసిన వీక్లీ ఔట్‌లుక్‌లో పేర్కొంది.
