న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో పోటీ పరీక్షల సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోటీ పరీక్షలను మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రధాని మోడీ ఈ ప్రకటన చేశారు.
ఈ మేరకు ఆదివారం (జులై 26) ఓ వీడియో రిలీజ్ చేసిన మోడీ.. దేశంలో పోటీ పరీక్షల సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందుకోసం టెక్ నిపుణుడు నందన్ నిలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సురక్షిత పరీక్ష విధానం కోసం తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షల విధానంలో కీలక మార్పులు చేపడతామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు.
పేపర్ లీకేజీలతో యువత భవిష్యత్తో ఆడుకున్నవారు ఇప్పటికే జైల్లో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్ లీకేజీ కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశించామని గుర్తు చేశారు. పోటీ పరీక్షల్లో అక్రమాలను నివారించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఇందులో భాగంగా కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. కొత్త చట్టాన్ని సోమవారం (జులై 27) పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పారు.
