ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ ఉండదు.. ఉన్నత హోదాలో ఎప్పుడూ ఏదో ఒక లోటు ఉంటుంది. ఇల్లంతా వాస్తు ప్రకారం ఉన్నా.. జాతకంలో ఎలాంటి ఇబ్బందులు లేవని పండితులు చెప్పినా ఇబ్బందులు.. కష్టాలు వెంటాడుతుంటాయి. ఇలాగా ఇబ్బంది పడే వారు నరదృష్టి వలన వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఎన్ని పూజలు.. చేసినా.. హోమాలు చేసినా.. ఎన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించినా ఇబ్బందులు వెంటాడుతున్నాయా.. అసలు అలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి..వాటి పరిష్కారానికి ఏమి చేయాలి.. వాస్తు నిపుణులు.. జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారు. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
ఇల్లు కట్టేటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి అంతా వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మించినా కాని కష్టాలు వెంటాడుతుంటాయి. సొంతింట్లో కంటే.. అద్దె ఇంట్లో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటారు. జ్యోతిష్య నిపుణులను సంప్రదించి పరిహారాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. అంటే మీరు కట్టిన ఇంటి స్థలంలో దోషం ఉంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి.
మీరు ఇల్లు కట్టిన స్థలంలో గతంలో చెరువులు ఉన్నా.. బావి ఉన్నా.. స్మశానం లాంటి ఉన్నా .. ఇంకా ఇతర స్థల దోషాలున్నా వాటి గురించి తెలియదు. బిల్డర్స్ వాటి గురించి చెప్పరు. వాటని తొలగించి ఆ స్థలాన్ని డెవలప్ చేసి ఇంటిని నిర్మిస్తారు. మనం మామూలుగా వాస్తు హోమాలు.. గృహప్రవేశం పూజలు చేసి ఇంట్లోకి వెళతాము. అలా చేయడం వలన కొంత వరకే ఉపశమనం కలుగుతుంది. మనం అప్పటి నుంచి నిత్య దీపారాధన.. పూజలు చేయడం వలన భవిష్యత్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | ఆధ్యాత్మికం:జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు? తల్లి గర్భంలో 9 నెలలు ఏం చేస్తాడు..!
కాని గతంలో స్థలదోషం ఉంటే మాత్రం పైన తెలిపిన సమస్యలు.. ఇబ్బందులు వెంటాడుతుంటాయి.. వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం.. తెల్లజిల్లేడు చెట్టుతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ చెట్టులో తొమ్మిది రకాలున్నాయి. తెల్లజిల్లేడు చెట్టు 12 సంవత్సరాలు వర్షం లేకపోయినా.. సూర్యకాంతితో నీటిని గ్రహించి.. పెరిగే తత్త్వం కలిగినది. తెల్లజిల్లేడు చెట్టులోని వేరును తీసుకుని.. ఆ వేరుతో వినాయకుడిని తయారుచేసుకుని.. ఇంటి పూజగదిలో వుంచి పూజ చేస్తే.. సకలసంపదలు చేకూరుతాయి.
శ్రీ స్వర్ణగణపతి మంత్రాన్ని( ఓం క్షంః రియుం క్షిప్ర గణపతయే సువర్ణకే హే వ్యవస్థితాయ స్వర్ణప్రదాయ క్లీం వషట్ స్వాహా) ఉచ్ఛరించి.. తెల్లజిల్లేడు వినాయకుడిని ప్రార్థిస్తే.. ధనార్జన చేకూరుతుంది. రత్నాలు, విలువైన శిల్పాలు, గుప్త నిధులు వున్న ప్రాంతాల్లో మాత్రమే తెల్లజిల్లేడు చెట్టు పెరుగుతుందని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అలాంటి తెల్లజిల్లేడు వేరుతో చేసిన వినాయకుడిని ఇంట వుంచి పూజిస్తే ఐశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శ్వేతార్క గణపతిని పూజించే వారికి జ్ఞానం, సంపద, సుఖశాంతులు లభిస్తాయి. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివశిస్తాడు. ఈ వేర్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. ఈ మొక్క గనుక ఇంట ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
తెల్లజిల్లేడుతో తయారు చేసిన వినాయకుడిని పూజించే ఇంట వుండేవారి ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలు పూర్తిగా నశిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నంమని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. జాతకచక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, జాతకచక్రంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు, వాస్తుదోషాలతో సతమతమయ్యేవారు సర్వకార్యసిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని గృహంలో ప్రతిష్టించి పూజించాలి.
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. బ్రాహ్మణులను సంప్రదించి, వారి సలహా మేరకు ముహూర్తం పెట్టుకుని.. ఇంట శ్వేతార్క గణపతిని ప్రతిష్టించుకోవాల్సి వుంటుంది. ఒకవేళ ఆలయాల్లో శ్వేతార్క గణపతి ప్రతిమను కొనుక్కుని తెచ్చుకున్నట్లైతే పూజగదిలో వుంచి రోజూ నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
