అసెంబ్లీ ఘటనపై క్రిమినల్ కేసులు.. సిట్‌తో సమగ్ర విచారణ : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ ఘటనపై క్రిమినల్ కేసులు.. సిట్‌తో సమగ్ర విచారణ : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: అసెంబ్లీలో దగ్గర జరిగిన ఘటనపై ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర విచారణ కోసం జాయింట్ సీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫామ్‌హౌస్‌లో ఉండి కుట్రలు చేసేవారిపైనా చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ ఘటనకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.

గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిని, ఆయన తల్లిని అవమానించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితులను అవమానించేలా జరిగిన ఘటనలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శిక్షార్హమైనవని అన్నారు. దళితుల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ బాధ్యతగా వ్యవహరించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితులు తిరిగిన ప్రాంతాన్ని శుద్ధి చేసి ఉన్మాదాన్ని చాటుకున్నారని మండిపడ్డారు. జరిగిన తప్పిదాన్ని గుర్తించి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సమాజాన్ని విడగొట్టి అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న కుటుంబాన్ని సమాజం బహిష్కరించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుద్ధి చేయాల్సింది నేలను కాదు.. మనసుల్లో పేరుకుపోయిన కుళ్లును అని రేవంత్ రెడ్డి అన్నారు. దళితుల పట్ల వివక్ష చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం అన్నారు. కుళ్లిన ఆలోచనలను నీటితో కాకుండా యాసిడ్‌తో శుద్ధి చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన కుర్చీని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జరిగిన ఘటన రెండు వర్గాల మధ్య వైరంగా మారే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. చేసిన తప్పును సరిదిద్దుకుని క్షమాపణ చెబితే వారి కిరీటం కిందపడుతుందా? అని ప్రశ్నించారు. దళితులను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.