- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఇక్కడ నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే ప్రాజెక్ట్‌లో భాగంగా, మనోహరాబాద్ – సిద్దిపేట నూతన రైలు మార్గంలో రూ. 6 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను ఆధునికంగా నిర్మించారు. ఈ కొత్త రైల్వే స్టేషన్‌ను ఆదివారం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట – సికింద్రాబాద్ డెమో రైలుకు ఆయన జెండా ఊపనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఈ స్టేషన్‌లో హై లెవెల్ ప్లాట్‌ఫామ్, ప్లాట్‌ఫామ్ పైకప్పు, ప్రయాణికులు వేచి ఉండే గది, తాగునీటి నల్లాల వంటి ప్రాథమిక వసతులను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి రోజువారీగా వేలాది మంది భక్తులు కొమురవెల్లి ఆలయానికి వస్తుంటారు. ఇప్పటివరకు నేరుగా రైలు వసతి లేకపోవడంతో భక్తులు బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడేవారు. తాజాగా ఈ స్టేషన్ అందుబాటులోకి రాబోతుండటంతో భక్తుల రవాణా కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ – సిద్దిపేట మధ్య నడుస్తున్న నాలుగు డెమూ సర్వీసులకు కొమురవెల్లి స్టేషన్‌లో అదనపు స్టాపేజ్ కల్పించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
