సైబర్ మోసాలకు పాల్పడుతున్న విదేశీ నేరగాళ్లపై అమెరికా కఠిన చర్యలు చేపట్టింది. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద కొత్త వీసా ఆంక్షలను ప్రకటించింది. ఈ ఆంక్షలు సైబర్ నేరాల్లో నేరుగా పాల్గొన్న వారికే కాకుండా, వారి సమీప కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.
ఏటా అమెరికన్లు బిలియన్ డాలర్ల సైబర్ మోసాలకు గురవుతున్నారని, సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూబియో చెప్పారు.అమెరికన్ల సేవింగ్స్ ను దోచుకుంటున్న ఆన్‌లైన్ మోసగాళ్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ చర్యల్లో భాగంగా నేరస్థులపై ఆంక్షలు విధించడం, విచారణలు చేపట్టడం, ఆస్తులను జప్తు చేయడం, అవసరమైతే ఇతర దేశాల నుంచి అప్పగింత కోరడం వంటి చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని కూడా పేర్కొంది.
ఇప్పటికే సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. సైబర్ మోసాలను ప్రోత్సహించే లేదా సహకరించే దేశాలు వీసా ఆంక్షలు, ఆర్థిక పరిమితులు, విదేశీ సహాయంపై ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
2024లో అమెరికాలో సైబర్ మోసాల వల్ల 12.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు ఈ మోసాలకు ఎక్కువగా బలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
