ఆ మేజిస్ట్రేట్‌‌కు ఎంత ధైర్యం?..మేం చెప్పినా నోటీసులిస్తారా?.. సుప్రీంకోర్టు ఆగ్రహం

ఆ మేజిస్ట్రేట్‌‌కు ఎంత ధైర్యం?..మేం చెప్పినా నోటీసులిస్తారా?.. సుప్రీంకోర్టు ఆగ్రహం
  • కాక్రోచ్‌‌ జనతా పార్టీ ధర్నాలో పాల్గొన్న స్టూడెంట్‌‌కు నోటీసులివ్వడంపై అభ్యంతరం
  • గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌‌ నుంచి వివరణ కోరతామని వెల్లడి

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల్లో పాల్గొన్న ఓ విద్యార్థికి గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లను రద్దు చేస్తూ, వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని గతంలోనే తాము ఆదేశించినా ఈ నోటీసు ఎలా ఇస్తారని బుధవారం నిలదీసింది. ‘‘ఓ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇలాంటి నోటీసు ఎలా ఇవ్వగలరు? దేశంలో ఏ విద్యార్థిపైనా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని మా ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఓ మేజిస్ట్రేట్ ఇలా చేయడానికి ఎంత ధైర్యం?" అని ఘాటుగా ప్రశ్నించింది. సీజేపీ నిరసనలకు సంబంధించి జులై 20 నుంచి 25 మధ్య వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలైన ఆర్టికల్ 142 కింద రద్దు చేసింది. భవిష్యత్తులోనూ విద్యార్థులపై ఎలాంటి కొత్త చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది.

నోటీసు వివాదం

గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి అక్షత్ త్రిపాఠికి సెప్టెంబర్ 4న నోటీసు జారీ అయింది. ఆయన ప్రభుత్వ వ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేశారని, జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ ఆందోళనల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించారని అందులో ఆరోపించారు. సీనియర్ న్యాయవాది విశ్వజిత్ భట్టాచార్య ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ నోటీసును సెప్టెంబర్ 5న వెనక్కి తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. ఆదేశాలు అమల్లో ఉండగా నోటీసు జారీచేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, తర్వాత ఆ నోటీసును ఉపసంహరించుకున్నంత మాత్రాన చేసిన తప్పు సమర్థనీయం కాదని   తెలిపారు.  ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ ఈ ఘటనపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఎలాంటి శిక్షార్హమైన లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని సెప్టెంబర్ 1న తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ‘‘యువతపై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రికార్డుల్లో ఉంచండి. 

విద్యార్థికి నోటీసు జారీ చేయడంపై గౌతమ్ బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌ నుంచి వివరణ కోరతాం” అని పేర్కొన్నారు. యువతపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు ఇలా వ్యవహరించడం ఆశ్చర్యకరమని సీజేఐ వ్యాఖ్యానించారు.