- బీఆర్ఎస్నేతల తీరును గవర్నర్‌కు వివరించిన డిప్యూటీ సీఎం, మంత్రులు
- అసెంబ్లీ లోపల, బయట జరిగిన ఘటనలు గవర్నర్ దృష్టికి
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ శివప్రతాప్ శుక్లాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కలిశారు. బుధవారం మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు ఎడ్మబొజ్జు, కవ్వంపల్లి సత్యనారాయణ లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసి.. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా స్పీకర్ పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారని.. మరణించిన తల్లిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించి మొత్తం దళిత సమాజాన్ని, రాష్ట్రంతో పాటు దేశంలోని మహిళలందరినీ అవమానించారని డిప్యూటీ సీఎం, మంత్రులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అసెంబ్లీ ఎంట్రీ దగ్గర మీడియా కెమెరాల సమక్షంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తొలుత తన చొక్కాను విప్పగా, అనంతరం ఇతరులు కూడా అదే విధంగా చేసి పోలీసు సిబ్బందిపై చొక్కాలను విసిరారన్నారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది వైపు దూసుకెళ్లి.. వారిని తాకుతూ, అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తించారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కేటీఆర్ నేతృత్వంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పోలీసు సిబ్బందిపై, మహిళా పోలీసు అధికారులపైన భౌతికంగా దాడి చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. దళిత సమాజానికి చెందిన సభ్యులు శాంతియుతంగా, చట్టబద్ధంగా ఎర్రవల్లి వైపు ర్యాలీగా వెళ్లి, ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరారని.. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అత్యంత దారుణమైన చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు.
దళిత సోదరులు, సోదరీమణులు నడిచిన రహదారులను పసుపు నీరు, పాలు చల్లి ‘శుద్ధి’ చేయడం ద్వారా అంటరానితనం ఆచరణను బీఆర్‌ఎస్ ప్రదర్శించిందని మంత్రులు పేర్కొన్నారు. ఈ చర్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం బీఆర్‌ఎస్ నేతలు గర్వంగా ప్రచారం చేశారని వెల్లడించారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో దళిత సమాజానికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ నాయకులు వినతిపత్రంలో వివరించారు. దళితులను సీఎంను చేస్తామన్న హామీని విస్మరించడం, దళిత సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం టి. రాజయ్యను అనూహ్యంగా పదవి నుంచి తొలగించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ ఘటనలకు పాల్పడిన వారిపైనే కాకుండా, బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులకు కూడా అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కోరారు.
