- ‘సంసద్ రత్న’ అవార్డుల కార్యక్రమంలో కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చొక్కాలు విప్పామని ఒక పార్టీ, విప్పించామని మరోపార్టీ సంబరపడుతోందని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
బుధవారం ఢిల్లీలో ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ రత్న’ అవార్డుల ప్రోగ్రాంకు ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు రాజకీయ నాయకుల ప్రవర్తనను నిశితంగా గమనిస్తుంటారని, అందువల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
