114 గజాల జాగాలో ఐదు అంతస్తుల భవనమా ? ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు

114 గజాల జాగాలో ఐదు అంతస్తుల భవనమా ? ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు
  • నిర్మాణ స్థలాల్లో అనుమతి వివరాలు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయించండి
  • జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో భవన నిర్మాణాలకు మంజూరైన అనుమతుల వివరాలను ఆయా నిర్మాణ స్థలాల్లో స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని జీహెచ్‌‌ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

అనుమతి వివరాలు ప్రదర్శించే వరకు నిర్మాణ పనులను నిలిపివేయాలని సూచించింది. 75 చదరపు గజాల్లోపు స్థలాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతి పొందే నిబంధన దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

సిద్ధంబజార్‌‌, బేగంబజార్‌‌ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి అనుమతుల పరిస్థితిని నిర్ధారించాలని ఆదేశించింది. సిద్ధంబజార్‌‌లో 114.14 చదరపు గజాల స్థలంలో నిర్మిస్తున్న భవనానికి సీలు వేసి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. తన స్థలంలో చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు జులై 30న సమర్పించిన దరఖాస్తును అధికారులు పరిశీలించలేదంటూ సిద్ధంబజార్‌‌కు చెందిన రాజ్‌‌కుమార్‌‌ హైకోర్టును ఆశ్రయించాడు.

పిటిషన్‌‌పై జస్టిస్‌‌ బి. విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారణ చేపట్టారు. అనుమతులు లేని నిర్మాణాలపై అవి ప్రారంభమైన దశలోనే చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు స్పష్టం చేసినా అమలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.

114.14 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్‌‌ ప్లస్‌‌ రెండు అంతస్తులకు మాత్రమే అనుమతి సాధ్యమైనప్పుడు, నాలుగు లేదా ఐదు అంతస్తులను క్రమబద్ధీకరించాలనే అభ్యర్థనకు అవకాశం లేదన్నారు.

అనుమతి కోసం 43.29 చదరపు మీటర్లకు మాత్రమే దరఖాస్తు చేసి, మిగిలిన భాగానికి పాత యజమానుల పేర్లతో దరఖాస్తులు చేయడం, అవి తిరస్కరణకు గురైనా నిర్మాణాలు కొనసాగించడం నిబంధనల ఉల్లంఘనేనని వ్యాఖ్యానించారు. విచారణను వాయిదా వేశారు.