ఎర్రవల్లిలో మళ్లీ శుద్ధీకరణ ..మారని బీఆర్ఎస్ నాయకుల తీరు

ఎర్రవల్లిలో మళ్లీ శుద్ధీకరణ ..మారని బీఆర్ఎస్ నాయకుల తీరు
  • దళితులు నిరసన తెలిపిన ప్రదేశంలో శుద్ధి
  • పసుపు నీళ్లతో కడిగేసిన గులాబీ లీడర్లు
  • వెహికల్​లో డ్రమ్ము.. అందులో పసుపు నీళ్లు..
  • వీధుల్లో తిరుగుతూ శుద్ధి చేసిన నాయకులు
  • శుద్ధీకరణపై సిద్దిపేట పీఎస్​లో కాంగ్రెస్ ఫిర్యాదు

సిద్దిపేట/ములుగు, వెలుగు: దళిత నేతలు ఆందోళన చేసిన ప్రాంతాల్లో పసుపు నీళ్లతో శుద్ధీకరణ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నా.. బీఆర్ఎస్ నేతల తీరు మాత్రం మారడం లేదు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ దళిత నాయకులు డప్పు చప్పుళ్లతో నిరసన వ్యక్తం చేసిన ప్రాంతాలను బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లు చల్లి శుద్ధిచేశారు. ఓ వెహికల్​లో పెద్ద డ్రమ్ములో పసుపు నీళ్లు కలుపుకుని వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ జిందాబాద్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ శుద్ధీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కమ్మరి బాల్ రాజు, నారన్నగారి రామ్మోహన్ రెడ్డి, కరుణాకర్, ఆంజనేయులు, బాలచారి, మల్లేశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుశుద్ధీకరణ చేసిన బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసులు నమోదు చేయాలని బుధవారం సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా హరికృష్ణ మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. శుద్ధి చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు.