- పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలను గణనీయంగా పెంచిందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కొత్త కనీస వేతనాలతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు1.10 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అనే 4 కేటగిరీలుగా వర్గీకరించినట్టు తెలిపారు.
వేతనాల నిర్ణయం కోసం రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్టు చెప్పారు. స్కిల్డ్ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన వేతనాలు వర్తిస్తాయని చెప్పారు. అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు సంబంధించిన వివరాలను లేబర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన జీఓ నంబర్ 6లో పొందుపరిచినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా సవరించిన కనీస వేతనాలు వర్తిస్తాయని మంత్రి తెలిపారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల సవరణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాల సవరణకు చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. కోర్ ఏరియాలో రూ.10,900గా ఉన్న కనీస వేతనాన్ని రూ.14వేలకు పెంచినట్టు చెప్పారు. జోన్-2లో రూ.15వేలు, జోన్-1లో రూ.16వేలుగా కనీస వేతనాలను నిర్ణయించినట్టు వెల్లడించారు.
