శుద్ధి చేయాల్సింది బీఆర్ఎస్ నేతల బుద్ధిని : డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క

శుద్ధి చేయాల్సింది బీఆర్ఎస్ నేతల బుద్ధిని : డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సమాజం ఫ్యూడల్, వివక్షపూరిత భావజాలాన్ని సహించబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  ‘శుద్ధి చేయాల్సింది నేలను కాదు.. బీఆర్ఎస్ వాళ్ల బుద్ధిని, వాళ్ల ఆలోచనలను’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలకు తాను ఇప్పటికే కలతచెందానని, కానీ 24 గంటలు గడవకముందే దళితులు నడిచిన రహదారులను శుద్ధి చేసిన ఘటన మరింత బాధ కలిగించిందని చెప్పారు. ఇది కేవలం దళితులను అవమానించడం కాదని, మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్‌‌తోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారిలో తప్పు చేసిన పశ్చాత్తాపం కూడా కన్పించడంలేదన్నారు.

కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి

మాజీ సీఎం, బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలు అందించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుం టున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.   “ఈ ప్రభుత్వం గానీ, ఈ సభ్యులు గానీ, ఈ సభ గానీ కేసీఆర్ చావును కోరుకోవడం లేదు. ఆయన నిండుగా నూరేళ్లు జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా సేవలు అందించాలని బలంగా కోరుకుంటున్నాం” అని భట్టి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయుష్షుతో ఉండాలని తాము హృదయపూర్వకంగా కోరు కుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సభా మర్యాదలను పాటించాలన్నారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.