ఫాంహౌస్ కుట్రలపై సమగ్ర విచారణ : సీఎం రేవంత్‌‌రెడ్డి

ఫాంహౌస్ కుట్రలపై  సమగ్ర విచారణ :  సీఎం రేవంత్‌‌రెడ్డి
  • హైదరాబాద్ సిటీ జాయింట్  సీపీ విజయ్ కుమార్​కు బాధ్యతలు
  • ఈ నెల 6 నుంచి పరిణామాలపై దర్యాప్తు 
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా కఠినమైన సెక్షన్లు
  • ఘటన వెనుక ఎవరున్నా జైలుకు పంపుతం
  • కేసీఆర్ ఆదేశాల మేరకే వాళ్లు రెచ్చిపోయిండ్రు !
  • అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్‌‌రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్ 6న ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్ కేంద్రంగా జరిగిన కుట్రలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు. శాసనసభాపతిని అవమానించడం, సభా ప్రాంగణంలో మహిళా పోలీసులపై దాడులకు తెగబడడంలాంటి ఘటనలన్నింటికీ  ఫాంహౌస్​లోనే వ్యూహరచన చేశారనే అనుమానాలున్నాయని, ఆ కుట్రను తేల్చేందుకు హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్టు చెప్పారు. 

బుధవారం ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటన చేశారు. ప్రత్యక్షంగా దాడులకు పాల్పడిన వారితో పాటు తెరవెనుక ఉండి ఉసిగొల్పిన పెద్దలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీసహా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. స్పీకర్ కుర్చీని కించపరచడం అంటే 4  కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, జరిగిన తప్పును సరిదిద్దుకొని ప్రతిపక్ష నేత కేసీఆర్.. వెంటనే సభాపతికి, సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో సభాపతికి ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉంటుందని తేల్చిచెప్పారు. 

అంతా కుట్ర ప్రకారమే.. 

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశామని, విద్యారంగం, ధరణి అక్రమాలు, 22ఏ వివాదాలు తదితర అంశాలపై చర్చ జరగాల్సి ఉందని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు.  కానీ ఈ సమావేశాలు సజావుగా సాగితే గత పదేండ్ల తమ ప్రభుత్వ వైఫల్యాలు, అప్పుల లెక్కలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో బీఆర్‌‌ఎస్ అగ్రనేతలు ఈ కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. సెప్టెంబర్ 6న సాయంత్రం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై అసెంబ్లీని స్తంభింపజేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేశారని చెప్పారు. సభ జరగకుండా అడ్డుకోవాలని, ప్రజాసమస్యలపై చర్చ రాకుండా వివాదాలు సృష్టించాలని సభ్యులను ఉసిగొల్పారన్నారు. ఫామ్‌‌హౌస్‌‌లో జరిగిన కుట్ర ఫలితంగానే మరుసటి రోజు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌‌ఎస్ ప్రజా ప్రతినిధులు ఉన్మాదుల్లా ప్రవర్తించారని సీఎం మండిపడ్డారు. 

సభాపతిపై ఇష్టారాజ్యంగా విరుచుకుపడటమే కాకుండా.. శాంతిభద్రతలను కాపాడేందుకు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులపై, ముఖ్యంగా మహిళా పోలీసులపై భౌతిక దాడులకు తెగబడ్డారని అన్నారు. ముంబైపై కసబ్ జరిపిన దాడి, పార్లమెంట్‌‌పై ఉగ్రవాదుల దాడి, పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడుల తరహాలోనే ప్రతిపక్ష సభ్యులు దూకుడుగా వ్యవహరించారని మండిపడ్డారు. అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్‌‌ను, ఆయన తల్లిని అవమానించేలా మాట్లాడటం వెనుక విచక్షణారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే సభ్యులు రెచ్చిపోయారని, సభా ప్రాంగణంలో మహిళలను, అధికారులను కించపరిచేలా వ్యవహరించిన తీరును బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సహా అన్ని పక్షాలు తీవ్రంగా ఖండించాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 

ఎవ్వరినీ వదిలిపెట్టం 

ఫాంహౌస్‌‌​ మీటింగ్​ దగ్గర నుంచి అసెంబ్లీ గేట్ల ముందు  బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు చేసిన హంగామా, స్పీకర్‌‌‌‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల వరకు సమగ్ర విచారణ చేపట్టనున్నట్టు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. ‘‘గతంలో సిద్దిపేట కమిషనర్‌‌గా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్‌‌గా ఉన్న విజయ్ కుమార్‌‌ను  పర్యవేక్షణ అధికారిగా నియమించి సమగ్ర విచారణ జరిపించాలని ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ 6న ఫామ్‌‌హౌస్‌‌లో జరిగిన సమావేశం, అందులో పన్నిన కుట్రలు, తీసుకున్న నిర్ణయాల నుంచి మొదలుపెడితే.. 7న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు పథకం ప్రకారం  పోలీస్​అధికారులు, ముఖ్యంగా మహిళా అధికారుల మీద చేసిన దాడులు, బహిరంగంగా చేసిన అంగ ప్రదర్శనలు, సభా ప్రాంగణంలో స్పీకర్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలు.. వీటన్నింటికి ఆధారాలు సేకరించి ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లు, పరోక్షంగా ప్రోత్సహించినవాళ్లు, ఎక్కడో దాక్కొని కుట్రలు పన్నిన వాళ్లందరి మీద సమగ్ర విచారణ చేపడ్తాం.  

క్రిమినల్ కేసులు పెట్టి కోర్టు ముందు నిలబెడ్తాం.. కోర్టులు బెయిల్​ ఇచ్చినా ఈ తెలంగాణ సమాజం ఇవ్వదు.. ఉప్పుపాతరేస్తాం’’ అని పేర్కొన్నారు. సమాజాన్ని విడగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించిన వారిపై చట్టపరంగా అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్​), సెక్షన్ 3(1)(యూ) ప్రకారం బహిరంగ ప్రదేశంలో ఉద్దేశపూర్వకంగా దళితులను అవమానించడం, వారిపై విద్వేషాన్ని ప్రదర్శించడం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. అలాగే, బీఎన్ఎస్ సెక్షన్ 352, 353(2) రెడ్ విత్ 3/5 ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, అల్లర్లను ప్రేరేపించే చర్యలకు పాల్పడినందుకు కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. 

‘‘రాజ్యాంగబద్ధమైన స్పీకర్ కుర్చీని అవమానించిన వారిని, మహిళా అధికారులపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని సీఎం స్పష్టం చేశారు. ‘‘ఇది నేను చెప్పడం లేదు.. బీఆర్‌‌ఎస్‌‌ అంతర్జాతీయ కార్యదర్శి సంధ్యారావు స్వయంగా ప్రకటించారు’’ అని పేర్కొన్నారు. ఇది స్పీకర్‌‌కు జరిగిన  అవమానం మాత్రమే కాదని,  యావత్​తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని స్పష్టంచేశారు.  ఈ సభ, ప్రభుత్వం మీకు(స్పీకర్​కు) సంపూర్ణంగా అండగా నిలబడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ  మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌‌‌‌జరిగిన తప్పును తెలుసుకొని  సభాపతికి, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌‌ డిమాండ్​చేశారు.