కేటీఆర్ దోస్తులు, బావకు  రూ.320 కోట్ల జాగా!..లాజిస్టిక్ పార్కుల పేరిట లాజిక్ 

కేటీఆర్ దోస్తులు, బావకు  రూ.320 కోట్ల జాగా!..లాజిస్టిక్ పార్కుల పేరిట లాజిక్ 
  • టెండర్ ఒకరికి.. ప్రాజెక్టు మరొకరికి..పీపీపీ ముసుగులో 68 ఎకరాలకు స్కెచ్
  • రూల్స్​కు పాతర.. తన వాళ్లకు జాతర
  • బాట సింగారంలో క్రెడెన్స్ అక్రమాల ‘బాట’ 
  • మంగళ్​పల్లిలో కేసీపీ బోర్డు మాయం
  • బయటికి రాని ఒరిజినల్ టెండర్ ఫైళ్లు  
  • బీఆర్ఎస్ పాలనలో గోల్​మాల్​

హైదరాబాద్, వెలుగు: వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పబ్లిక్‌‌–ప్రైవేట్‌‌ భాగస్వామ్యం (పీపీపీ) పేరుతో గత సర్కారు పెద్దలు తమ సన్నిహితులకు ధారాదత్తం చేశారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. హెచ్ఎండీఏ పరిధిలోని బాటసింగారం, మంగళ్‌‌పల్లి లాజిస్టిక్స్ పార్కులతోపాటు నందిగామ–కొత్తూరు సమీపంలోని అనుబంధ గిడ్డంగులను కలుపుకుంటే ఏకంగా 67.74 ఎకరాల మేర విలువైన స్థిరాస్తుల నెట్‌‌వర్క్ గుట్టురట్టయింది. బహిరంగ మార్కెట్ లెక్కల ప్రకారం ఈ భూముల విలువ కనిష్టంగా రూ.230 కోట్లు, గరిష్టంగా రూ.410 కోట్లు.. సగటున చూస్తే సుమారు రూ.320 కోట్ల పైమాటేనని రియల్ ఎస్టేట్ వర్గాలు లెక్కగడుతున్నాయి.

కానీ  ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువను కేవలం రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్ల మధ్యే చూపిస్తుండడం గమనార్హం. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంతరంగికులు, ఆయనకు  వరుసకు బావ అయ్యే రాజేంద్రప్రసాద్​ పాకాలకు చెందిన కంపెనీల చేతుల్లోనే ఈ 33 ఏళ్ల లీజుల వ్యవహారం నడుస్తుండడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.  టెండర్లు దక్కించుకున్న ఒరిజినల్ సంస్థలను క్రమంగా తప్పించి, నాటి అధికార పార్టీ పెద్దల బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ భూములను కట్టబెట్టడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.  పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిబంధనలను ఎలా మార్చేశారు? తెరవెనుక నడిచిన అసలు ఒప్పందాలేమిటన్న దానిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.

తెరవెనుక భారీ తతంగం..

బాటసింగారంలోని సర్వే నంబర్ 10లో హెచ్ఎండీఏకు చెందిన 40 ఎకరాల ప్రైమ్‌‌ ల్యాండ్‌‌లో 33 ఏండ్ల కాలపరిమితితో చేపట్టిన లాజిస్టిక్స్ పార్కు వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి.  ప్రాథమికంగా రూ.35 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు పనులు ముగిసేసరికి రూ.40 కోట్లకు పెంచేశారు. రెండు లక్షల చదరపు అడుగుల గోడౌన్, 500 భారీ ట్రక్కుల పార్కింగ్, కోల్డ్ స్టోరేజీలతో కూడిన ఈ భారీ ప్రాజెక్టును తొలుత ‘క్రెడెన్స్ లాజిస్టిక్స్ పార్క్’ దక్కించుకున్నది. కానీ అనుమతుల్లో జాప్యం, వ్యయం పెరిగిందన్న సాకుతో క్రెడెన్స్ సంస్థ అదనపు సాయం లేదా గడువు పొడిగింపును కోరగా.. ఆ తర్వాత అనూహ్యంగా సీన్ మారిపోయి ప్రాజెక్టు కాస్తా ‘కేపీసీ–ట్రక్ డాక్’ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

ప్రస్తుతం దీనిని ‘హెచ్ఎండీఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పర్యవేక్షిస్తుండగా.. ఇందులో కేటీఆర్ తన మిత్రుడిగా స్వయంగా చెప్పుకున్న మహేశ్ వొడెల కుమార్‌‌ గుప్తా, ఆయన భార్య మాధురి డైరెక్టర్లుగా ఉన్నారు. మొదట టెండర్ గెలిచిన క్రెడెన్స్ కాంట్రాక్టు రద్దు ఉత్తర్వులు, ఆ తర్వాత నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వివరాలు, లెటర్ ఆఫ్ అవార్డు పత్రాలు బయటకు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కేవలం అధికార పలుకుబడితోనే టెండర్ నిబంధనలను తుంగలో తొక్కి తమ దోస్తు కంపెనీకి ఈ 40 ఎకరాలను అప్పగించారన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.

తెరపైకి ఒకే సిండికేట్!

ఇబ్రహీంపట్నం దగ్గర్లోని మంగళ్‌‌పల్లి సర్వే నంబర్ 124లో 22 ఎకరాల హెచ్ఎండీఏ భూమిలో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ పార్కులోనూ అచ్చం ఇదే తరహా కార్పొరేట్ మాయాజాలం నడిచింది. రూ.50 కోట్ల పెట్టుబడి, 2.5 లక్షల చదరపు అడుగుల గోడౌన్ల సామర్థ్యంతో 33 ఏండ్ల లీజుకిచ్చిన ఈ పార్కు నిర్వహణ ప్రస్తుతం ‘హెచ్ఎండీఏ అన్‌‌కాన్ లాజిస్టిక్స్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’ చేతుల్లో ఉంది. రాజశేఖర్ వొడెల, నీలిమ వొడెల, లొకేశ్ చంద్ర దాసరి, ఉదయ్‌‌రావు సెండోల్ ఈ కంపెనీలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. మొదట్లో టెండర్ అర్హత కోసం సాంకేతిక, ఆర్థిక బలం ఉన్న ‘కేసీపీ’ కంపెనీతో కలిసి ‘అన్‌‌కాన్–కేసీపీ’ పేరిట బిడ్ వేసి పని దక్కించుకున్నారు.

పని పూర్తయ్యాక అసలు డైరెక్టర్లు కమిశెట్టి అనిల్ కుమార్, సుశీల్ కుమార్‌‌ను బయటకు పంపేసి, కంపెనీ పేరులోంచి ‘కేసీపీ’ని తొలగించి ప్రాజెక్టును పూర్తిగా రాజశేఖర్ వొడెల గ్రూప్ తమ గుప్పిట్లోకి తీసుకున్నది. ప్రభుత్వ ఒప్పందాల్లోని లాక్–ఇన్ రూల్స్‌‌ను బ్రేక్ చేసి కన్సార్టియం సభ్యులను మార్చేందుకు అధికారులు ఎలా అనుమతించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పైగా మంగళ్‌‌పల్లి కంపెనీ డైరెక్టర్ ఉదయ్‌‌రావు బాటసింగారంలోని ట్రక్ డాక్ బోర్డులోనూ ఉండడం, బాటసింగారం సంస్థ అన్‌‌కాన్ ఈ–మెయిల్ డొమైన్‌‌ను వాడటం చూస్తుంటే ఈ రెండు పార్కుల వెనుక ఒకే సిండికేట్ నడిచిందన్న సంగతి స్పష్టమవుతోంది.

రూ.లక్ష క్యాపిటల్​.. రూ.92 కోట్ల అప్పులు.. గ్రీన్ రూల్స్‌‌కు పాతర 

కేటీఆర్​కు వరుసకు బావ అయ్యే రాజేంద్ర ప్రసాద్ పాకాలకు చెందిన ‘అన్రి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ చుట్టూ ఉన్న కార్పొరేట్ లింకులు లాజిస్టిక్స్ దందాలోని మరో కోణాన్ని బయటపెడుతున్నాయి. కేవలం లక్ష రూపాయల పెయిడ్–అప్ క్యాపిటల్‌‌తో 2010లో ఏర్పాటైన అన్రి బిల్డర్స్.. 2023–24 నాటికి రూ.28.71 కోట్ల వార్షిక ఆదాయాన్ని, ఏకంగా రూ.92.22 కోట్ల మేర రుణాల ఓపెన్ చార్జీలను కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షార్ప్ వెంచర్స్ కంపెనీలో కేటీఆర్ సతీమణి శైలిమ కల్వకుంట్ల డైరెక్టర్‌‌గా వైదొలిగిన రోజే రాజేంద్ర పాకాల ఆ కుర్చీలో కూర్చోవడం వీరి మధ్యనున్న బిజినెస్ నెట్‌‌వర్క్‌‌ను రుజువు చేస్తున్నది.

మరోవైపు నందిగామ–కొత్తూరు పరిధిలోని సర్వే నంబర్లు 1866 నుంచి 1890 మధ్యనున్న భూముల్లో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌‌యూఎల్) సరుకుల కోసం రాజేంద్ర పాకాలకు చెందిన ‘స్క్వేర్ డాట్ వేర్‌‌హౌసింగ్’ భారీ గోడౌన్‌‌ను నిర్వహిస్తోంది. కేంద్ర పర్యావరణ అనుమతులు (ఈసీ) తప్పనిసరి అయ్యే 20వేల చదరపు మీటర్ల లిమిట్ నుంచి తప్పించుకోవడానికి.. నిర్మిత విస్తీర్ణాన్ని కేవలం 799 చదరపు మీటర్లు తక్కువగా, అంటే 19,200 చ.మీటర్లు (సుమారు 2.07 లక్షల చదరపు అడుగులు)గా పేపర్లలో చూపించి గ్రీన్ క్లియరెన్స్ నిబంధనలకు పాతరేశారన్న విమర్శలున్నాయి.

 ప్రభుత్వ భూములపై ప్రైవేటు చార్జీలు.. ఖజానాకు ఒరిగిందేమిటి?

230 కోట్లకుపైగా మార్కెట్ విలువైన 67 ఎకరాల హెచ్ఎండీఏ పబ్లిక్ స్థలాలను 3 దశాబ్దాల పాటు ప్రైవే టు వ్యక్తులకు కట్టబెడితే ప్రభుత్వ ఖజానాకు ఒరిగిందేమిటన్నది ఇప్పుడు తేలాల్సిన అసలు లెక్క. ఈ ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని సదరు ప్రైవేటు కంపెనీలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కోట్లాది రూపాయల అప్పులను దర్జాగా సమీకరించాయి. ట్రక్ డాక్ సంస్థ ఏపీఎస్ఎఫ్సీ, టాటా క్యాపిటల్ నుం చి, అన్‌‌కాన్ లాజిస్టిక్స్ సంస్థ విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌‌డీఎఫ్‌‌సీల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి.

అసలు ప్రభుత్వ లీజు హక్కులనే బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి ప్రైవేటు కంపెనీలు అప్పులు తెచ్చుకున్నాయా? దీనికి హెచ్ఎండీఏ బోర్డు నుంచి రాతపూర్వక అనుమతులు ఉన్నాయా? తేలాల్సి ఉంది. కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించిన ముందస్తు ప్రీమియం, వార్షిక లీజు రశీదులు, పనుల ఆలస్యానికి విధించిన జరిమానాల తాలూకు ఫైళ్లను బయటపెట్టాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నా రు. ఒరిజినల్ టెండర్ ఫైళ్లు, బిడ్ల పోలిక పత్రాలను పారదర్శకంగా ఆడిట్ చేస్తేనే.. పీపీపీ ముసుగులో ప్రజా సంపదను తమ ఆప్తులకు ఎలా దోచిపెట్టారన్న వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశముంది.