- ప్రభుత్వం విడుదల చేసినవి ఏఐ ఫొటోలు, వీడియోలే
- దీనిపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేస్తం
- లోక్‌భవన్ వద్ద మీడియా సమావేశంలో కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తమకు స్పీకర్‌పై అపారమైన గౌరవం ఉన్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీనే ఆయనను ‘దళిత స్పీకర్.. దళిత స్పీకర్’ అంటూ అవమానించేందుకు చూస్తున్నదని అన్నారు. ‘‘అందుకే అది శాసనసభ కాదు.. కౌరవ సభ.. దుశ్శాసన సభ’’ అని వ్యాఖ్యానించారు. హామీలు అమలు చేయాలని అడిగినందుకే తమపై దాడులు చేయించారని ఆరోపించారు. తాము పోలీసులపై దాడులు చేసినట్టు- ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు, వీడియోలన్నీ ఏఐతో సృష్టించినవేనని, దీనిపై సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే.. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం.. మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ‘‘అసెంబ్లీ మొదటి రోజే మాపై ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపినట్టుగానే మేం కూడా టీషర్టులు వేసుకొని నిరసన తెలిపినం. కానీ, మా హక్కులను కాలరాస్తూ.. మా ఎమ్మెల్యేలందరినీ సభలోకి రాకుండా రోడ్డుపైనే అడ్డుకున్నరు. మా మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపారు. చివరికి కేసీఆర్‌చావును కోరుకునే స్థాయికి కాంగ్రెసోళ్లు దిగజారిన్రు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లారు” అని మండిపడ్డారు. ‘‘ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, కోర్టులపై ఎలాంటి గౌరవం లేదు. అందుకే ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేశారు. శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్టుగా ఆపాదిస్తూ, జరగని అవమానాన్ని జరిగినట్టుగా చూపిస్తూ దళిత స్పీకర్ పేరిట రాజకీయం చేస్తున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవి ఏఐ ఫొటోలు కాదు..
అసెంబ్లీ వద్ద తాము మహిళా పోలీసులను నెట్టివేయలేదని.. ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలన్నీ ఏఐ జనరేటెడ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే అవన్నీ ఒరిజినల్ ఫొటోలేనని HIVE DETECT అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ తేల్చింది.
