- నగరంలో హుస్సేన్‌సాగర్ సహా 17 చెరువులు, 30 పాండ్స్ వద్ద 110 క్రేన్లు
- నిమజ్జనానికి ఇబ్బందుల్లేకుండా గేబియన్ వాల్స్ నిర్మాణం
- 3 షిఫ్టుల్లో పనిచేయనున్న 770 మంది పారిశుధ్య కార్మికులు
- 286 మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు వినాయక మండపాల వద్ద పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక యాక్షన్ టీంలను రంగంలోకి దించనుంది. నగరవ్యాప్తంగా హుస్సేన్ సాగర్ సహా16 చెరువులు, 30 బేబీ పాండ్స్ కలిపి మొత్తం 47 చోట్ల నిమజ్జనం జరగనుంది. గణేశుని విగ్రహాలను తరలించేందుకు, నీటిలోకి దించేందుకు 110 క్రేన్లను ఏర్పాటు చేయనుంది. వీటిలో 40 క్రేన్లు హుస్సేన్ సాగర్ వద్దే అందుబాటులో ఉంచనున్నారు.
ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం 770 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో పని చేయనున్నారు. నిమజ్జన ప్రదేశాలతోపాటు నగరంలోని వినాయక మండపాల వద్ద కూడా పారిశుధ్య పనులను ప్రత్యేకంగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా 286 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది. చెత్త సేకరణ, తరలింపు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్ లో గేబియన్ వాల్స్..
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన సమయంలో భద్రత, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎన్టీఆర్ మార్గ్‌లో హెచ్ఎండీఏ రెండు కొత్త గేబియన్ వాల్స్ నిర్మిస్తోంది. పనులు చివరి దశకు చేరాయి. లుంబినీ పార్క్ వద్ద ఇప్పటికే ఉన్న గేబియన్ వాల్‌ను పునర్నిర్మించారు. నిమజ్జన వేదికలు దెబ్బతినకుండా రక్షించడంతోపాటు మట్టి కోతను అరికట్టి చెరువు కట్టను పటిష్టం చేయడం ఈ నిర్మాణాల ఉద్దేశం. బడా గణేశ్ నిమజ్జన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గేబియన్ వాల్సక్సెస్అవడంతో మరికొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేశారు.
ఏటా గణేశ్ ఉత్సవాల అనంతరం ఖైరతాబాద్ బడా గణేశ్ సహా వేలాది విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. భారీ విగ్రహాల బరువు, క్రేన్ల వినియోగంతో నిమజ్జన వేదికలు దెబ్బతిని కుంగిపోవడంతోపాటు నిరంతర మట్టి కోత కారణంగా చెరువుల అంచులు బలహీనపడుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్‌లోని ప్రస్తుత వేదిక క్రేన్ కార్యకలాపాల కారణంగా ఏటా దెబ్బతింటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం, భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కొత్త గేబియన్ నిర్మాణాలతో క్రేన్లను సురక్షితంగా నిర్వహించడంతోపాటు నిమజ్జన కార్యక్రమాలను సౌకర్యవంతంగా చేపట్టవచ్చని అంటున్నారు.
శాఖల మధ్య సమన్వయం..
నిమజ్జనం సజావుగా సాగేందుకు పోలీస్, హైడ్రా, ఆర్టీసీ, రవాణా, జలమండలి, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), పర్యాటక తదితర శాఖల అధికారులతో జీహెచ్‌ఎంసీ సమన్వయం చేసుకుంటోంది. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, విద్యుత్ సరఫరా, నీటి నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాలపై ఆయా శాఖలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తోంది. గణేశ్ఉత్సవాలు మొదలైన మూడో రోజు నుంచి భారీ విగ్రహాల నిమజ్జనం జరగనుంది.
ఐడీఎల్ చెరువులో పూడిక, వ్యర్థాల తొలగింపు
కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువులో గణేశ్ నిమజ్జనానికి హైడ్రా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన రహదారి వైపు చెరువును లోతుగా తవ్వుతూ, వ్యర్థాలతో పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నారు. ఇప్పటికే 20 అడుగులకు పైగా పూడికను తొలగించడంతోపాటు ఊట నీరు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి చెరువులోకి చేరిన మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), కొబ్బరి పీచు, ఇతర చెత్త పెద్ద మొత్తంలో బయటకు వస్తోంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఐడీఎల్ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జనానికి అవసరమైన నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానికులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా హైడ్రా కమిషనర్‌ను కలిసి నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాక చెరువులో మిగిలిన పూడికను పూర్తిగా తొలగించి 72 ఎకరాల విస్తీర్ణంలోని ఐడీఎల్ చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుందని అధికారులు తెలిపారు.
