- ఆనాడు దళిత కౌలు రైతులకు రైతు బంధు ఇయ్యాలని కోరితే తిరస్కరించారు
- పెట్టుబడి సబ్సిడీ కూడా ఇయ్యలే..అసెంబ్లీలో మంత్రి వివేక్ ఫైర్
- మేఘా లాంటి సంస్థలకు జనం సొమ్ము దోచి పెట్టిండు
- బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో వెయ్యి కోట్లు వేసుకున్నరు
- స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా దళితులపై వివక్ష తగ్గట్లే
- మహిళా ఎమ్మెల్యే ల వెనుక ఉన్నది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే
- విజువల్స్ చూసి వాళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆనాడు బీఆర్‌ఎస్ గవర్నమెంట్‌లో దళిత కౌలు రైతులకు రైతు బంధు ఇయ్యాలని కోరితే తిరస్కరించారని గుర్తుచేశారు. వాళ్లకు ఇండస్ట్రీ సబ్సిడీ కూడా ఇయ్యేలేదని చెప్పారు. ‘మేఘాలాంటి సంస్థలకు జనం సొమ్ము దోచి పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో వెయ్యి కోట్లు వేసుకున్నరు’’ అని విమర్శించారు. అసెంబ్లీ ముందు జరిగిన బీఆర్‌ఎస్ గొడవల్లో ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేల వెనుక ఉన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలేనని చెప్పారు. ఒరిజినల్ వీడియో విజువల్స్ చూసి వాళ్లపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ ముందు దళితులు డప్పులు కొట్టి నిరసన వ్యక్తం చేసిన స్థలంలో పసుపు నీళ్లతో శుద్ధి చేసిన సంఘటనపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా దళితులపై వివక్ష తగ్గట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన సమయంలో డప్పులు కొట్టడాన్ని విక్టరీకి సంకేతంగా చూపించిన బీఆర్‌ఎస్ లీడర్లు.. ఇప్పుడు చావు డప్పులుగా చిత్రీకరించడం సరికాదన్నారు.
దళితులను ఓట్లకోసం వాడుకున్నరు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ పదే పదే చెప్పడంతో నమ్మిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని మంత్రి వివేక్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ మాట తప్పి ఆయనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారని ఎద్దేవా చేశారు. దళితులను ఓట్ల కోసం వాడుకొని వదిలేయడం కేసీఆర్‌కు అలవాటేనని అన్నారు. అధికారం పోగానే ఆయనలో ఉన్న అహంకారం బయటపడ్డదని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే సమయంలో ఎకరానికి రూ.5 లక్షలు కాకుండా రూ.10 లక్షలు కేటాయిస్తే ఎక్కువగా భూమి కొని పంచి ఇవ్వవచ్చని తాను ఆనాడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. అయినా ఆయన దళిత కౌలు రైతులకు సాయం చేసే విషయాన్ని, 3 ఎకరాల భూమి పంపిణీని సరిగ్గా పట్టించుకోలేదని తెలిపారు.
మేఘా కంపెనీతో టై అప్!
రాష్ట్రంలో తన పదేండ్ల పాలనలో దళితులకు, బడుగు బలహీనవర్గాల వారికి కేసీఆర్ ఎలాంటి మేలు చేయలేదని మంత్రి వివేక్ తెలిపారు. అదే సమయంలో మేఘా కంపెనీకి అనేక ప్రాజెక్టులు ఇచ్చి లక్షల కోట్లు దోచుకోవడానికి సహకరించారని పేర్కొన్నారు. దీనికిగానూ ఆ కంపెనీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ చేసుకున్నారని విమర్శించారు. క్విడ్ ప్రో కోలో భాగంగా ఇదంతా జరిగిందని చెప్పారు. పేద, మధ్య తరగతి కాంట్రాక్టర్లను పట్టించుకోలేదని అన్నారు. దళితులకు ఇన్వెస్ట్మెంట్సబ్సిడీ కూడా ఇయ్యలేదని మంత్రి వివేక్ విమర్శించారు.
