- కేసీఆర్ చావు కోరిన వీర్లపల్లి శంకర్‌పై చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ ఆందోళన
- పోడియంను చుట్టుముట్టడంతో శాసన సభ్యులపై వేటు
- కేసీఆర్ చావును ఎవరూ కోరుకోరన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సభా వ్యవహారాలను అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. ఈ సెషన్ ముగిసేవరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. కేసీఆర్ చావును కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కామెంట్ చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
రాతపూర్వకంగా కోరితే పరిశీలిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలుసార్లు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డికి సూచించినా వారు వినలేదు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని కోరినా ఫలితం కనిపించలేదు. 45 నిమిషాల పాటు వారు పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు. ‘‘రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పదేళ్లు మంత్రులుగా పనిచేశారు. మంత్రులుగా పనిచేసిన వాళ్లు స్పీకర్ పోడియం ముందుకొచ్చి ఇలా వ్యవహరించవచ్చా.. గత పదేళ్లలో ఎపుడైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారా?’’ అని స్పీకర్
ప్రశ్నించారు.
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ సభ్యులు పదేపదే వెల్‌లోకి వచ్చి స్పీకర్‌తో వాగ్వా దానికి దిగడం, ఆయన సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని, సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. “ఈ సభ, ఈ రాష్ట్రం ఆత్మగౌరవంపై ఏర్పడింది. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు మంచిది కాదు. స్పీకర్‌ను దారుణంగా అవమానించారు. ఇపుడు ఇంకో అంశంపై ఆందోళన చేస్తున్నారు. మీకు ఏం న్యాయం కావాలి.
జస్టిస్ కావాల్సింది ఈ రాష్ట్రంలోని దళిత, బహుజన వర్గాలకు, గిరిజనులకు. మీ చేతుల్లో అవమానాలకు గురైన ప్రజలందరికి” అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహనం పాటిస్తోందని, పదే పదే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం సరికాదని సూచించారు. దొరతనపు పోకడలను తెలంగాణ ప్రజలు భరించడానికి సిద్ధంగా లేరని, బీఆర్‌ఎస్ ‘శుద్ధి కార్యక్రమం’పై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. ‘కేసీఆర్ చావును ఎవరూ కోరుకోరు. ఆయన ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయుష్షుతో ఉండాలని, ప్రతిపక్ష నేతగా సేవలు అందించాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు.
కేసీఆర్ వందేళ్లకుపైగా బతకాలి: శ్రీధర్‌బాబు
కేసీఆర్ చావును ఎవరూ కోరుకోరని, ఆయన నూరేళ్లకుపైగా బతకాలని, తెలంగాణకు సేవ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీఆర్ఎస్లేవనెత్తిన అంశాన్ని రాతపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తానని స్పీకర్ ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు కరీంనగర్‌లో ‘అక్కడేం చస్తున్నవ్ రాహుల్ గాంధీ’ అని కామెంట్ చేశారని.. తమ ఎమ్మెల్యేల మాటల్లోనూ తప్పు జరిగిందని, వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించామన్నారు. తమది ఎవరి చావు కోరుకునే పార్టీ కాదని, ఏదైనా రాజకీయంగా ఎదుర్కొంటామని శ్రీధర్ బాబు అన్నారు.
దళితులు నడిచిన చోట బీఆర్ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేసిన అంశంపై చర్చ జరగాలని మంత్రి లక్ష్మణ్ప్రస్తావించారని తెలిపారు. రెండు రోజుల పాటు స్పీకర్ మీద దాడి చేశారని, ఇప్పుడు దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. సభ నడవొద్దని వారు కోరుకుంటున్నారని, స్పీకర్ అప్పీల్ చేస్తున్నా వినకుండా, స్పీకర్‌ను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సార్లు చెప్పినా వినకపోతే తాము ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. క్వశ్చన్ అవర్, షార్ట్ డిస్కషన్‌లో పాల్గొనాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరారు.
తగ్గని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సస్పెండ్ చేసిన స్పీకర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆందోళన కొనసాగించడంతో సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానాన్ని ప్రతిపాదించారు. అనిల్ జాదవ్, హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డి, కౌశిక్ రెడ్డి, కృష్ణారావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కోవాలక్ష్మి, ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాసయాదవ్, సుధీర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కేటీఆర్, విజయుడు, వివేకానందను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్‌ప్రకటించారు. అనంతరం సభను టీ బ్రేక్ కోసం వాయిదా వేశారు.
