దేశానికి గర్వకారణం: మీరాబాయి చానుకి  మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

దేశానికి గర్వకారణం: మీరాబాయి చానుకి  మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

 

భారత క్రీడా రంగానికి మరో సువర్ణావకాశాన్ని తెచ్చిపెట్టిన వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చానుపై అభినందనల వెల్లువ కురుస్తోంది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించిన మీరాబాయి చానును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వకంగా అభినందించారు.

మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం దేశానికే అత్యంత గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో ఆమె వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని సాధించడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. 2018 గోల్డ్‌కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్ క్రీడల ఘనతల తర్వాత, ఇప్పుడు 2026 కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి మోత మోగించి భారత క్రీడా చరిత్రలో మీరాబాయి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారని మంత్రి ప్రశంసించారు.

యువ క్రీడాకారులకు స్ఫూర్తి

మీరాబాయి చాను సాధించిన ఈ చారిత్రక విజయం దేశంలోని యువ క్రీడాకారులందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కఠినమైన కృషి, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించవచ్చని ఆమె మరోసారి నిరూపించారని ప్రశంసించారు.

యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో గర్వకారణంగా నిలిచిన మీరాబాయి చానుకు మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో జరిగే మరిన్ని అంతర్జాతీయ పోటీల్లోనూ ఆమె ఇలాంటి ఘన విజయాలు సాధించి దేశానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.