- అదిరిపోయిన ఓపెనింగ్ సెర్మనీ
- జపాన్ సాంప్రదాయ మూలాలను గుర్తుకు తెచ్చేలా నృత్యాలు
- ‘ఒకే ఆసియా’ ఇతివృత్తంతో సాగిన కార్యక్రమం
- ఆకట్టుకున్న ఇండియా అథ్లెట్ల కవాతు
నగోయా: సాంప్రదాయ నృత్యాలు.. కళాకారుల ఆటలు.. డ్రమ్స్ వాయిద్యాలు.. లేజర్ కాంతుల మిరుమిట్లు.. బాణాసంచా వెలుగులతో 20వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆద్యంతం ఆహూతులను కట్టిపడేసిన ఈ షోలో జపాన్ తన సాంకేతిక, పారిశ్రామిక పరాక్రమంతో పాటు లోతైన సాంస్కృతిక మూలాలను ప్రదర్శించింది. సంస్థాగత, లాజిస్టిక్ సమస్యలు సన్నాహాలను దెబ్బతీసినా.. అవి ఏమాత్రం గుర్తుకు రాకుండా ఓపెనింగ్ సెర్మనీని చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. ‘హార్మోనిక్ హార్ట్ బీట్’ అనే భావనతో 1958 టోక్యో, 1994 హిరోషిమా గేమ్స్ తర్వాత ఐచీ నగోయాలో మూడోసారి ప్రపంచ అథ్లెట్లకు ఘన స్వాగతం పలికింది. ‘ఒకే ఆసియా’ అనే ఇతివృత్తానికి నిదర్శనంగా హార్ట్ ఆకారపు వేదికను ఎంచుకుని వివిధ దేశాల అథ్లెట్లను ఏకతాటి పైకి తెచ్చింది. ఖండం నలుమూలల నుంచి క్రీడాకారులు, ప్రజలు ‘హృదయపూర్వకంగా’ అనుసంధానం కావడానికి ఇది ప్రతీకగా నిలిచింది. 30 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిపోయిన మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన ఈ అద్భుత ప్రదర్శన స్థానిక ఐచి పారిశ్రామిక సాంకేతికతను శాస్త్రీయ కళతో సజావుగా మేళవించింది. ఇందులో సాంప్రదాయ జపనీస్ కబుకి వేదిక అంశంతో పాటు, జెండాను ఊపుతున్న ఒక భారీ పారిశ్రామిక రోబోట్ చేయి కూడా ఉన్నాయి. రెండు గంటల పాటు జరిగిన ప్రారంభోత్సవ వేడుక మధ్యలో జపాన్ చక్రవర్తి నరుహిటో, మహారాణి మసాకో, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధిపతి కోవెంట్రీల సమక్షంలో ఆసియా క్రీడలను ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఐచి ప్రిఫెక్చర్‌లో టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నందున, దానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలను వేదికపై ప్రదర్శించారు.
టోక్యో 2020 ఒలింపిక్స్, పారాలింపిక్ క్రీడల కోసం టయోటా అభివృద్ధి చేసిన, ప్రత్యేకమైన తక్కువ వేగంతో ప్రయాణించే మొబిలిటీ వాహనంగా ప్రసిద్ధి చెందిన యాక్సెసబుల్ పీపుల్ మూవర్ (ఏపీఎమ్) ఈ ప్రదర్శనలో ప్రముఖంగా నిలిచింది. రాబోయే 15 రోజులలో, 45 దేశాలకు చెందిన సుమారు 11,000 మంది అథ్లెట్లు 43 క్రీడలు, 71 క్రీడాంశాల్లో బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 4న ముగిసే ఈ క్రీడల వరకు మొత్తం 469 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, క్రికెట్ మరియు మరికొన్ని ఈవెంట్ల పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఫ్లాగ్ బేరర్స్‌గా మను, సెహ్రావత్..
టాప్ షూటర్ మను భాకర్, కబడ్డీ ప్లేయర్ పవన్ సెహ్రావత్ త్రివర్ణ పతాకం చేపట్టగా.. అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య ఇండియా అథ్లెట్ల బృందం పరేడ్‌లోకి ప్రవేశించింది. ముదురు నీలం రంగు చీర, బంద్‌గాలా శైలి ఉత్సవా జాకెట్ ధరించిన మను.. సెహ్రావత్‌తో కలిసి 150 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రేక్షకులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. మెన్స్ ప్లేయర్లు ముదురు నీలం రంగు బంద్‌గాలా శైలి ఉత్సవ జాకెట్లు, దానికి సరిపోయే ప్యాంట్‌లను ధరించారు. 46 జట్ల కవాతులో సాంప్రదాయం ప్రకారం చివరి స్థానంలో నిలిచిన ఆతిథ్య దేశం జపాన్‌కు కొద్దిగా ముందుగా, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు చెందిన ఇద్దరు అథ్లెట్ల శరణార్థుల బృందం వచ్చింది. 'అవేకనింగ్ ఆఫ్ ది స్పేస్ అండ్ ది రెసోనేటింగ్ హార్ట్ బీట్' అనే స్వాగత కార్యక్రమంతో వేడుకకు నాంది పలికారు. జపాన్‌కు చెందిన అత్యంత ప్రియమైన వయోలిన్ విద్వాంసులు మరియు స్వరకర్తలలో ఒకరైన టారో హకాసే, ఒక క్రీడా ఉత్సవ ప్రారంభోత్సవానికి తగినట్లుగా వీనుల విందైన సంగీతాన్ని అందించారు.
10 మీటర్ల ఎత్తైన జెండా..
పోటీల ప్రారంభాన్ని సూచిస్తూ మెరుస్తున్న 10 మీటర్ల ఎత్తైన జెండా ఒక దీపస్తంభంలా పైకి లేవగా, గుండె ఆకారపు రెక్కలున్న దేవదూత డ్రోన్‌లు గాలిలో మెరుస్తూ తేలియాడుతూ, ప్రారంభోత్సవ స్వాగత నృత్యం కోసం ఆ ప్రాంగణాన్ని హృదయాల ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి. హకాసే వయోలిన్ సోలో ప్రారంభం కాగానే, నగోయా, ఐచిలోని ఇతర ప్రాంతాల నుండి నాలుగు వేర్వేరు రంగుల సమూహాలుగా ఏర్పడిన 240 మంది పౌర నృత్యకారులు వేదిక కింద నుండి బయటకు వచ్చారు. నృత్యకారులు ఆతిథ్యాన్ని తెలియజేస్తూ 'స్వాగతం' అనే పదం వచ్చేలా నిలిచారు.
నగోయా కోటను కేంద్రంగా చేసుకొని, 'సాంప్రదాయపు హృదయ స్పందన' అనే ఇతివృత్తంతో ఐచి-నగోయా యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించారు. ఐచి-నగోయా యొక్క తయారీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, లేజర్‌లను ఉపయోగించిన ఒక హై-టెక్ ప్రదర్శనను చూపెట్టారు. ఈ ప్రదర్శనలో యాంత్రిక నృత్యకారులు, వర్క్‌వేర్ నృత్యకారులు, బిజినెస్ సూట్ నృత్యకారులు, ఎల్‌ఈడీ నృత్యకారులు, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రోలర్ నృత్యకారులు, బాల నృత్యకారులు పాల్గొనగా, చివరగా హోనోహోన్ నృత్యంతో ముగిసింది.
