పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరార్.. సిద్దిపేట జనరల్ ఆసుపత్రి వద్ద ఘటన

 పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరార్..     సిద్దిపేట జనరల్ ఆసుపత్రి వద్ద ఘటన
  • హ్యాండ్ కప్స్, లీడింగ్ చైన్  తొలగించుకుని ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి జంప్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా  జైలు నుంచి హెల్త్  చెకప్  కోసం సిద్దిపేట జిల్లా  హాస్పిటల్ కు తీసుకువచ్చిన రిమాండ్  ఖైదీ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. సిద్దిపేట వన్  టౌన్  సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్  జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయికుమార్  వాహనాల దొంగతనాల కేసులో ఈ నెల 15న చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించారు.

కాగా, శనివారం జిల్లా జైలులో ఉన్న సాయికుమార్ తో పాటు మరో ఆరుగురు ఖైదీలను నార్మల్  జనరల్  చెకప్  కోసం ఏఆర్  ఎస్సై గోపని ఒడ్డన్న ఆధ్వర్యంలో 9 మంది సిబ్బంది ప్రత్యేక వెహికల్​లో జిల్లా జైలు నుంచి సిద్దిపేట హాస్పిటల్ కు తరలించారు. ముందుగా సాయికుమార్ తో పాటు మరో ముగ్గురికి హెల్త్  చెకప్  చేయించిన సిబ్బంది వారిని వెహికల్​లోకి ఎక్కించి, ఒక కానిస్టేబుల్​ను ఎస్కార్టుగా ఉంచారు. 

మిగిలిన ముగ్గురిని చెకప్  కోసం తీసుకువెళ్లారు. ఆ సమయంలో సాయి కుమార్  తన చేతికి ఉన్న హ్యాండ్  కప్స్, లీడింగ్  చైన్  తొలగించుకొని ఎమర్జెన్సీ ఎగ్జిట్  నుంచి దూకి పారిపోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై సమీప ప్రాంతాల్లో వెతికినా సాయి కుమార్ జాడ దొరకలేదు. పరారరైన ఖైదీ కోసం ప్రత్యేక పోలీస్​ బృందాలతో గాలిస్తున్నామని సీఐ తెలిపారు.