వివక్షతో ‘సబ్ కా వికాస్’ ఎలా సాధ్యం? తెలంగాణపై వివక్ష ఇంకెంత కాలం !

వివక్షతో ‘సబ్ కా వికాస్’ ఎలా సాధ్యం? తెలంగాణపై వివక్ష ఇంకెంత కాలం !

భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన భారతదేశానికి సమాఖ్య స్ఫూర్తి ఊపిరిగా కొనసాగుతోంది.  గతంలో  కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించగా, ఇప్పుడు అధికరాంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో విలువలకు తిలోదకాలిస్తోంది. అన్ని రాష్ట్రాలకు, ప్రాంతాలకు సమానస్థాయిలో ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలతో ఎన్డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోంది. 

 ఇవే కుట్రలు  తెలంగాణపై  కొనసాగిస్తూ  రాష్ట్రానికి  కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. 12 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకుంటూ  ప్రకటనలు ఇచ్చుకోవడం హాస్యాస్పదం.  ఈ 12 ఏండ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిందిపోయి తెలంగాణపై పక్షపాతం చూపించడం దురదృష్టకరం. 

కేంద్రంలో  నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడి పన్నెండేండ్లు  పూర్తయినట్టే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడి పుష్కరమయ్యింది. ఈ కాలంలో ఐటీ, ఫార్మా, సేవారంగం, పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతులు, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారింది.  ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం దేశ ఆర్థికవృద్ధికి కీలక కేంద్రంగా ఎదిగింది. 

అయితే తెలంగాణ సాధించిన ఈ అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు లభించడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన అనేక హామీలు నేటికీ నెరవేరకపోవడం, తెలంగాణకు రావాల్సిన భారీ ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు మళ్లించడం,  కేంద్ర నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి  ప్రాధాన్యం దక్కకపోవడంపై  రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందన కరువైంది.

  • నిధుల కేటాయింపులో వివక్ష

తెలంగాణ  ఏర్పడిన తర్వాత రాష్ట్రం దేశ ఆర్థికవ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత  తెలంగాణ దేశంలో అత్యధిక పన్ను ఆదాయం అందించే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థలు, ఔషధ పరిశ్రమలు, తయారీరంగ సంస్థలు కేంద్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. 

2021-–22 నుంచి 2025-–26 జనవరి వరకు రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో సుమారు రూ.2.43 లక్షల కోట్లకు పైగా  వసూళ్లు  నమోదయ్యాయి. 2021–-22లో రూ.38,771 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 2024-–25 నాటికి రూ.56,638 కోట్లకు పెరిగాయి.  తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల వాటా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నా నిధుల  కేటాయింపులో మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. 

2019-–20 నుంచి 2023–-24 వరకు తెలంగాణ నుంచి ప్రత్యక్ష పన్నులు, సీజీఎస్టీ, ఇతర కేంద్ర పన్నుల రూపంలో సుమారు రూ.2.34 లక్షల కోట్ల ఆదాయం కేంద్ర ఖజానాకు చేరగా, అదేకాలంలో రాష్ట్రానికి పన్నుల వాటా,  గ్రాంట్లు, ఇతర బదిలీల రూపంలో వచ్చిన మొత్తం రూ.90 వేల కోట్లే. 2020-–21 నుంచి 2024-–25 మధ్య తెలంగాణ నుంచి కేంద్ర జీఎస్టీ, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ సుంకాలు, కేంద్ర ఎక్సైజ్ తదితర పన్నుల రూపంలో సుమారు రూ.4.32 లక్షల కోట్ల ఆదాయం కేంద్ర ఖజానాకు చేరగా, అదే కాలంలో పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్లు, ఇతర రూపాలలో రాష్ట్రానికి తిరిగి వచ్చిన మొత్తం నిధులు సుమారు రూ.1.84 లక్షల కోట్ల వరకు మాత్రమే. 

  • దేశ ఆర్థికవ్యవస్థకు తెలంగాణ తోడ్పాటు

తెలంగాణ కేంద్రానికి అందించిన ప్రతి రూ.100కు సుమారు రూ.43 మాత్రమే తిరిగివ్వడమే  కేంద్రం రాష్ట్రంపై చూపిస్తున్న వివక్షకు నిదర్శనం.  దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానాల్లో నిలుస్తోంది. 2024-–25 నాటికి  రాష్ట్ర  తలసరి  ఆదాయం సుమారు  రూ.3.80 లక్షలకు చేరుకోగా,  జాతీయ  సగటు  రూ.2.05 లక్షల వద్ద ఉంది.  అంటే  తెలంగాణ  తలసరి ఆదాయం దేశ సగటు కంటే దాదాపు 85 శాతం ఎక్కువ. 2014–-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉండగా,  పదేళ్లలో అది మూడురెట్లకు పైగా పెరిగింది. దేశ ఆర్థికవ్యవస్థకు ఇంత పెద్దస్థాయిలో తోడ్పాటు అందిస్తున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి తగిన మద్దతు లభించకపోవడం అన్యాయం.  

తెలంగాణ ప్రభుత్వం 2025-–26 బడ్జెట్లో మొత్తం రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించింది.  రీజినల్ రింగ్ రోడ్,  హైదరాబాద్ మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు,  కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం,  పాలమూరు-–రంగారెడ్డి నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, విద్యాసంస్థలు, పారిశ్రామిక ప్రాజెక్టులు ఇందులో పొందుపరిచింది. అయితే  కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క ప్రధాన ప్రాజెక్టుకూ నిధుల కేటాయింపులు జరగలేదు. 

  • హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఆటంకం

రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా,  దానికి బదులుగా అక్కడ పరిమిత స్థాయి రైల్వే నిర్వహణ కేంద్రం ప్రతిపాదించింది. వేలాది ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు అమలు కాకపోవడం తెలంగాణ యువతకు తీరని నష్టం. బయ్యారం ఉక్కు కర్మాగారం పరిస్థితి కూడా దాదాపు ఇంతే.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచ ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా అమలుకాలేదు. 

ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు, భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నా కేంద్రం వివక్ష చూపించింది. తెలంగాణలో కరవు ప్రాంతాల రూపురేఖలను మార్చే పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నా స్పందన కరువైంది.   విశ్వనగరం హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలోనూ కేంద్ర సహకారం ఆశించిన స్థాయిలో లేదు. వేగంగా పెరుగుతున్న హైదరాబాద్ మహానగరానికి మెరుగైన రవాణా, మౌలిక వసతులు అవసరమైన సమయంలో ఈ ప్రాజెక్టులకు తగిన మద్దతు లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. 

  • రాష్ట్ర  ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

సెమీకండక్టర్ రంగంలో దేశవ్యాప్తంగా భారీ పెట్టుబడులు ప్రకటించినప్పటికీ, తెలంగాణకు ఒక్క ప్రధాన సెమీకండక్టర్ తయారీ యూనిట్ కూడా కేటాయించకపోవడం విచారకరం. అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ రాజకీయాలతో తెలంగాణను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యతిచ్చారు. 

 విభజన చట్టంలోని హామీలు, కేంద్ర నిధుల పంపిణీ, భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల కేటాయింపులు, రైల్వే, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను పరిశీలిస్తే  తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదని కచ్చితంగా చెప్పవచ్చు. దేశ ఆర్థికవ్యవస్థకు ఇంజన్‌‌‌‌‌‌‌‌లా పనిచేస్తున్న రాష్ట్రం నుంచి భారీ పన్నులు వసూలు చేస్తూ, అదే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, సంస్థలను నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.   తెలంగాణ ప్రజలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక కోరికలు  కోరడం లేదు.  పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, కేంద్ర నిధుల్లో న్యాయమైన వాటా మాత్రమే కోరుతున్నారు.

  • పెండింగ్​లో ఉన్న హామీలను కేంద్రం అమలుచేయాలి

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో  నేడు అధికారంలో ఉండి ఉంటే నాడు  ఇచ్చిన హామీలన్నీ పూర్తయ్యేవి.  రాష్ట్ర ఏర్పాటులో  కీలక పాత్ర పోషించామని చెప్పుకునే బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధికి ఎందుకు సహకరించడం  లేదో సమాధానం చెప్పాలి.  రాష్ట్రం నుంచి  ఇద్దరు  కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలున్నా వారు నోరు మెదపరు.  తెలంగాణ నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టు అభివృద్ధి ఫలాలు కూడా ఇవ్వాలి.  

రాజకీయాలకు అతీతంగా పన్నెండేళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న హామీలను అమలు చేసి, తెలంగాణకు రావాల్సిన హక్కులను అందించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత  నెరవేరినప్పుడే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు పూర్తి న్యాయం జరిగినట్లవుతుంది.  వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యతనిస్తేనే మోదీ ప్రభుత్వం ప్రకటనల రూపంలో ప్రకటించుకుంటున్నట్టు దేశంలో ‘సబ్ కా సాత్   సబ్ కా వికాస్’ సాధ్యమవుతుంది.

- బి.మహేశ్ కుమార్ గౌడ్
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు

Note:  ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.