ఒక కుటుంబం కూతురి భవిష్యత్తు కోసం కన్న కలలు అన్నీ క్షణాల్లో కరిగిపోయాయి. విదేశాల్లో చదువుకుని, జీవితంలో తన కాళ్లపై తాను నిలబడాలని కెనడా వెళ్లిన ఆ యువతి.. అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా సమ్రాలాకు చెందిన 23 ఏళ్ల దమన్‌ప్రీత్ కౌర్ ఉదంతం అందరినీ కలచివేస్తోంది.
ఏం జరిగిందంటే.. దాదాపు ఐదేళ్ల క్రితం.. కూతురి చదువు కోసం, విదేశాల్లో స్థిరపడాలనే ఆమె కల నెరవేర్చడం కోసం దమన్‌ప్రీత్ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి మరీ ఆమెను స్టూడెంట్ వీసాపై కెనడాకు పంపించారు. అయితే, ఎడ్మంటన్‌లోని సిల్వర్‌బెర్రీ నగరంలో సహజీవన భాగస్వామితో కలిసి ఉంటున్న ఆమెకు ఊహించని విషాదం ఎదురైంది.
జూలై 9న అనుమానాస్పద గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న దమన్‌ప్రీత్ గురించి సమాచారం అందుకున్న ఎడ్మంటన్ పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని.. అత్యవసర సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. కానీ జూలై 12న తీవ్ర గాయాలతో ఉన్న దమన్‌ప్రీత్ తుదిశ్వాస విడిచింది.
దింతో పోలీసుల దర్యాప్తులో భాగంగా నిర్వహించిన పోస్టుమార్టంలో ఆమెది హత్య అని తేలింది. ఆమెను గొంతు నులిమి చంపినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిందితుడి అరెస్ట్..
ఈ దారుణ హత్యకు సంబంధించి దమన్‌ప్రీత్‌తో పాటు సహజీవనం చేస్తున్న 22 ఏళ్ల రితిష్ కుమార్ అనే భారతీయుడిని పోలీసులు జూలై 22న అరెస్టు చేశారు. అతనిపై సెకండ్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. ఇది కేవలం సన్నిహిత భాగస్వామి చేతిలో జరిగిన హత్యేనని, ఈ కేసుకు సంబంధించి మరెవరి ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
మృతదేహం కోసం తల్లిదండ్రుల పోరాటం
కూతురిని కడసారి చూసేందుకు, ఆమె శవాన్ని భారతదేశానికి రప్పించడానికి ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇందుకు GoFundMe ద్వారా ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించగా.. $20,000 డాలర్లు కావాల్సి ఉండగా.. $18,000 డాలర్లకు పైగా విరాళాలు అందాయి.
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో సముద్రాలు దాటిన ఒక యువతీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
