- ఏజెన్సీ ఏరియాల్లోని డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు
- ఈ సీజన్ నుంచి సాగుకు శ్రీకారం
- సాగుదారుల, స్థలాల ఎంపికపై ఆఫీసర్ల ఫోకస్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయ రంగంలో మహిళలు రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల మహిళలకు వెదురు సాగు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు వెదురు ఆధారిత ఉత్పత్తులతో వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో మొత్తం 11 వేల మంది మహిళా సాగుదారులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సీజన్ నుంచే మహిళలతో వెదురు సాగు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన వెదురు మొక్కలను ఇప్పటికే నర్సరీల్లో పెంచుతున్నారు.
మహిళలకు ఆర్థిక భరోసా..
గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వెదురు సాగుకు శ్రీకారం చుట్టింది. వెదురు సాగు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో భూములు, లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వెలుగు సమాఖ్య ఏపీఎంలు, డీపీఎంలకు కర్ణాటకలోని బెంగళూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఉపాధి హామీ కార్డు ఉండి, డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న చిన్న, సన్నకారు రైతు మహిళలను ఎంపిక చేస్తున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 11 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం, కాటారం, మల్హర్, మహదేవపూర్, పలిమెల, భూపాలపల్లి మండలాల నుంచి 4 వేల మంది, మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల నుంచి 2 వేల మంది, ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి 5 వేల మందిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటివరకు మూడు జిల్లాల్లో 4,920 మంది సభ్యులను, సాగు స్థలాలను గుర్తించినట్లు ఆఫీసర్లు తెలిపారు.
పూర్తి రాయితీపై మొక్కలు..
సాగుదారులకు ప్రభుత్వం పూర్తి రాయితీపై వెదురు మొక్కలు అందించనుంది. తొలి రెండు సంవత్సరాల పాటు సాగు నిర్వహణ ఖర్చులను కూడా భరిస్తుంది. మూడు జిల్లాల్లోని నర్సరీల్లో ఇప్పటికే 1.14 లక్షల వెదురు మొక్కలను సిద్ధం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక ఒకేసారి మొక్కల పంపిణీ, నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతి మహిళా సాగుదారుకు 15 గుంటల విస్తీర్ణంలో సాగు చేసేందుకు 60 వెదురు మొక్కలను అందించనున్నారు. వెదురు సాగు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాలపై డ్వాక్రా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హస్తకళలపై ప్రత్యేక శిక్షణ..
ఇప్పటికే డ్వాక్రా సంఘాల మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు, ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ వంటి అవకాశాలు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు వెదురు సాగు ద్వారా కూడా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తోంది. వెదురు సాగు చేసే మహిళలను వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీదారులు, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో హస్తకళలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, ఫర్నిచర్, ఇతర వెదురు ఉత్పత్తుల తయారీ, విక్రయాల ద్వారా మహిళలకు ఆదాయం వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది. లాభదాయకమైన వెదురు సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ వెదురు మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశంపై ఏజెన్సీ ప్రాంతాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
