హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 125 రోజులపాటు ఇచ్చే కోచింగ్‌కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అనాథ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు.
గ్రూప్-I, గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IVతో పాటు పోలీస్ నియామక పరీక్షలు, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శిక్షణ ఇస్తారు. శనివారం నుంచివచ్చే నెల 14 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు కొనసాగుతాయి. రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారు, గతంలో బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్ పొందిన వారు శిక్షణకు అనర్హులు. అర్హులైన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
