నీట్ పేపర్ లీక్ కేసును నిశితంగా పరిశీలిస్తాం.. ఈ సమస్యను ఇలాగే కొనసాగనివ్వలేం: సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీక్ కేసును నిశితంగా పరిశీలిస్తాం.. ఈ సమస్యను ఇలాగే కొనసాగనివ్వలేం: సుప్రీంకోర్టు
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంపై సమగ్ర వివరాలివ్వండి

న్యూఢిల్లీ: నీట్- యూజీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస పొరపాట్లకు స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ మోడ్) విధానానికి మారే అంశంపై ఉన్న ప్రణాళికల సమగ్ర వివరాలను అందజేయాలని ఆదేశించింది. నీట్ పేపర్ లీకేజీల అంశంపై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారాన్ని తాము చాలా నిశితంగా పర్యవేక్షిస్తామని, క్రమం తప్పకుండా ఫాలో-అప్ చేస్తామని స్పష్టం చేసింది. ‘‘పూర్తిగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విధానానికి మారడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. 

కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు మారినప్పుడు డేటాను ఎలా పరిరక్షిస్తారో వివరించండి. ప్రతిదీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో జరిగేలా మేం చూస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. 

కోర్టు ముందు పూర్తి స్థాయి ప్రతిపాదనలను ఉంచడానికి మరికొంత సమయం కావాలని కోరారు. దీనిపై స్పందించిన బెంచ్ ‘‘ఈ వ్యవహారాన్ని ఇలాగే  కొనసాగనివ్వలేం’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. 

విద్యార్థులపై లాఠీచార్జ్ కేసులో 27న విచారణ

నీట్ ఎగ్జాం పేపర్ లీక్ అంశంపై నిరసనల సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు తీవ్రస్థాయిలో దాడి చేశారంటూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 27న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నీట్ పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

ఈ నెల 20న  సీజేపీ పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ మార్చ్ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించారు. 

పోలీసులు దారుణంగా ప్రవర్తించారని నిరసనకారులు ఆరోపించగా.. తాము ఎంతో సంయమనంతో వ్యవహరించామని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.