- రోజుకో వెరైటీతో న్యూట్రిషన్ ఫుడ్, ఇప్పటికే లక్షన్నర మందికి సప్లై
- త్వరలో రూ. 720 కోట్లతో 20 లక్షల మందికి అందించేలా ప్లాన్
హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడి పిల్లల చదువులకు అర్ధాకలి అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రాం’ సత్ఫలితాలనిస్తోంది.
హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలోని పలు స్కూళ్లలో ఈ బ్రేక్ ఫాస్ట్ స్కీంను అమలు చేస్తుండగా.. ఆ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మెనూ ప్రకారం విద్యార్థులకు టిఫిన్స్ సప్లై చేస్తోంది.
రుచి, శుచి పాటిస్తూ హైజీనిక్ అట్మాస్పియర్ లో రోజుకో వెరైటీ టిఫి న్ ను హాట్ హాట్ గా సరఫరా చేస్తుండడంతో ప్రభుత్వ బడుల్లో హాజరు శాతం కూడా మెరుగవుతోంది. హరే కృష్ణ ఫౌండేషన్ ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు సెంటర్లలో మెగా సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్స్ ఏర్పాటు చేసి లక్షన్నర మందికి బ్రేక్ ఫాస్ట్ అందిస్తుండగా.. భవిష్యత్లో 20 లక్షల మంది స్టూడెంట్స్ కు బ్రేక్ ఫాస్ట్ అందించేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా స్పీడ్ సర్వీస్ కోసం జిల్లాకో షెడ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది.
రూ.720 కోట్లు.. 23 వేలకు పైగా స్కూళ్లు
కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సహకరించక, ఇంట్లో ఇన్ టైంలో వంట ప్రిపేర్ కాక, మరే ఇతర కారణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్ ఉదయం ఖాళీ కడుపుతోనే బడికి వస్తుంటారు. అలాంటి వాళ్లు అర్ధాకలితో పాఠాలపై దృష్టి పెట్టలేకపోవడంతో పాటు వారి ఆరోగ్యం, ఏకాగ్రతపైనా ప్రభావం పడుతుంటుంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ‘హరే కృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్’ భాగస్వామ్యంతో స్కీం ను ఇంప్లిమెంట్ చేయగా స్కూళ్లలో హాజరు శాతం పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23,103 స్కూళ్లలో రూ.720 కోట్లతో బ్రేక్ఫాస్ట్అందించేందుకు చర్యలు చేపట్టారు.
ఎన్ఐఎన్ మెనూ ప్రకారం హెల్తీ ఫుడ్
స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రాం అమలు చేస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) మెనూ ప్రకారం విద్యార్థులకు టిఫిన్స్ సప్లై చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ లో పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేసి స్కూళ్లకు తరలిస్తున్నారు.
పిల్లలకు ఒకే రకమైన ఆహారం కాకుండా వారంలో ఆరు రోజులు రోజుకో వెరైటీ చొప్పున సప్లై చేస్తున్నారు. ఇడ్లీ–సాంబార్, పూరీ–ఆలూ కుర్మా, దోసె–చట్నీ, ఉప్మా–చట్నీ, మిల్లెట్ ఇడ్లీ–సాంబార్, బోండా–చట్నీ.. ఇలా ఆరు రకాల వెరైటీస్ విద్యార్థులకు అందిస్తున్నారు.
ఇందులో ఉప్మా ప్రైమరీ స్కూల్ పిల్లలకు 150 గ్రాములు, హైస్కూల్ స్టూడెంట్స్ కు 200 గ్రాములు అందిస్తుండగా.. మిగతావన్నీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు 45 గ్రాములు.. హైస్కూల్ విద్యార్థులకు 60 గ్రాముల చొప్పున అందజేస్తున్నారు. రోజు విడిచి రోజు పాలు కూడా అందిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్, మీల్స్ పంపిణీ అనంతరం ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి ఫుడ్ క్వాలిటీపై దృష్టి పెడుతున్నారు.
పెరుగుతున్న హాజరు శాతం
గవర్నమెంట్ స్కూళ్ల స్టూడెంట్స్ లో ఇదివరకు అటెండెన్స్ పర్సంటేజీ అంతంతమాత్రంగానే ఉండేది. 50 శాతం మంది పిల్లలు వివిధ కారణాలతో గైర్హాజరయ్యేవారు. స్కూళ్లకు వచ్చేలా పిల్లలు ప్రార్థన ముగిసిన తరువాత వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రాం అమలులోకి వచ్చాక స్కూల్ అటెండెన్స్ లో గణనీయంగా మార్పు వచ్చినట్లు టీచర్లు చెబుతున్నారు.
స్పీడ్ సర్వీస్ కోసం జిల్లాకో షెడ్
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 మెగా సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. వీటిలో కొడంగల్, నార్సింగి, మహబూబ్ నగర్, వరంగల్, సంగారెడ్డి జిల్లా కంది వద్ద కిచెన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ఇప్పటి వరకు 1,500కు పైగా స్కూళ్లలో లక్షన్నర మంది స్టూడెంట్స్ కు ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ సప్లై చేస్తున్నారు. ఇదిలాఉంటే కొన్ని జిల్లాల్లో కిచెన్ షెడ్లు లేక పక్క జిల్లాల నుంచి సప్లై చేయడం దూరభారంతో పాటు టిఫిన్స్ వేడి తగ్గిపోయి పిల్లలు తినలేని పరిస్థితి ఎదురవుతోంది.
దీంతో స్పీడ్ సర్వీస్ అందించేందుకు మిగతా చోట్లా కిచెన్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు మెగా కిచెన్ షెడ్స్ ఉండగా.. ఈ నెల 27న ఖమ్మం జిల్లా మధిరలో మరో మెగా కిచెన్ ప్రారంభించనున్నారు. ఈ కిచెన్ నుంచి అక్కడి 798 స్కూళ్లలోని 44,125 మంది విద్యార్థులకు, 8 జూనియర్ కాలేజీల్లోని 3,100 స్టూడెంట్స్ కు బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు.
చక్కగా చదువుకుంటున్నం
గతంలో ఒక్కోసారి ఇంట్లో తినకుండానే స్కూల్ కు వచ్చేవాళ్లం. అప్పుడు ఆకలితో ఇబ్బంది పడి చదువుపై ధ్యాస ఉండేది కాదు. ఇప్పుడు బడిలోనే టిఫిన్స్ పెడుతుండడంతో ఆకలి విషయం మరిచి చక్కగా చదువుకుంటున్నం.
శిరీష, 7వ తరగతి, గుండ్లపహాడ్, వరంగల్ జిల్లా
ఇష్టంగా తింటున్నం
మా స్కూల్ లో రోజుకో రకం టిఫిన్ పెడుతున్నారు. క్లాస్‌మేట్స్‌తో కలిసి ప్రతిరోజు అన్నీ టిఫిన్స్ ఇష్టంగా తింటున్నాం.
కాట్రేవుల అనోక్, 9వ తరగతి, మర్కజీ స్కూల్
హాజరు శాతం పెరిగింది
మా స్కూల్ లో 686 స్టూడెంట్స్ ఉంటే, గతంలో 520 మంది వరకు వచ్చేవారు. బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రాం ప్రారంభించాక 580 నుంచి 600 మందికి పైగా వస్తున్నారు. ప్రైమరీ స్కూల్ లో 320 మంది పిల్లలుంటే, వంద మంది వరకు డుమ్మా కొట్టేవారు. ఇప్పుడు 280 మంది పిల్లలు బడికి వస్తున్నారు.
జీవీ రామారావు, హెచ్ఎం, మర్కజీ హైస్కూల్
