రూ. 370 బిర్యానీ తినిపిస్తే ఆ హక్కు వచ్చేస్తుందా? ముంబై పోలీస్ మీమ్‌పై ప్రియాంక చతుర్వేది ఫైర్!

రూ. 370 బిర్యానీ తినిపిస్తే ఆ హక్కు వచ్చేస్తుందా? ముంబై పోలీస్ మీమ్‌పై ప్రియాంక చతుర్వేది ఫైర్!

'రూ. 370 బిర్యానీ తినిపిస్తే... అమ్మాయిపై హక్కు వచ్చేస్తుందా?'.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్ ఇది. ఒక స్టాండప్ కామెడీ షోలో హిమాన్షు జంగ్రా అనే యువకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. మహిళలు , సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్లేట్ చికెన్ బిర్యానీ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం, చివరకు ముంబై పోలీస్ శాఖకు, శివసేన (UBT) ఫైర్ బ్రాండ్ లీడర్ ప్రియాంక చతుర్వేదికి మధ్య పెద్ద యుద్ధానికి దారితీసింది.

అసలేం జరిగింది?

కామెడియన్ ప్రణిత్ మోరే చేసిన ఒక స్టాండప్ కామెడీ షోలో హిమాన్షు జంగ్రా (23) అనే యువకుడు చెప్పిన ముచ్చట కాస్తా రచ్చ లేపింది. తాను ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్లానని, అక్కడ ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ, వాటర్ బాటిల్ కోసం రూ. 370 ఖర్చు పెట్టానని చెప్పాడు. అంతటితో ఆగకుండా, ఆ అమ్మాయి తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయమనగానే.. తాను పెట్టిన ఖర్చుకు ఆమెను ఆశించానంటూ నోరుపారేసుకున్నాడు.

రూ. 370 ఖర్చు పెట్టా.. వసూల్ తో కరుంగా అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒక చీకటి పార్కుకు కూడా తీసుకెళ్లానని గొప్పగా చెప్పుకున్నాడు. ఈ నీచమైన కామెంట్‌కి సదరు కామెడియన్ ప్రణిత్ మోరే నవ్వి, అతనికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

 

ముంబై పోలీస్ మీమ్స్ 

ఈ కాంట్రవర్సీని వాడుకుని ముంబై పోలీసులు పబ్లిక్ అవేర్‌నెస్ కల్పించాలనుకున్నారు. ఎక్స్‌ (X) లో మరాఠీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఒక పోస్ట్ పెట్టారు. రూ. 370 పెడితే ఒక ప్లేట్ బిర్యానీ మాత్రమే వస్తుంది. అదే మా లాకప్‌లో అయితే లాంగ్ స్టేతో పాటు ఫ్రీ మీల్స్ దొరుకుతాయి అంటూ క్రియేటివ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పోస్ట్ దాదాపు 3 లక్షల వ్యూస్‌తో తెగ వైరల్ అయింది. మహిళల గౌరవాన్ని కాపాడటం ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ కాదు. సమాజానికి అర్థమయ్యే ట్రెండింగ్ భాషలోనే మేము బుద్ధి చెబుతాం అంటూ పోలీసులు తమ పోస్ట్‌ను సమర్థించుకున్నారు.

►ALSO READ | సైకో హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్'.. హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

 ప్రియాంక  చతుర్వేది ఫైర్..

అయితే, ఈ పోస్ట్‌పై ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై పోలీస్ చేసిన పనిని అవమానకరం అని కొట్టిపారేశారు. మహిళలపై జరిగే ఇలాంటి అసభ్యకర, లైంగిక వేధింపుల ఘటనలను కేవలం లైకులు, వైరల్ కంటెంట్ కోసం మీమ్స్‌లా మార్చకూడదని హితవు పలికారు. ప్రతీ విషయాన్నీ కామెడీ చేయడం ఆపి, ముంబై వీధుల్లో మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని క్లాస్ పీకారు.

 

అకౌంట్స్ క్లోజ్!

నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేక నిందితుడు హిమాన్షు క్షమాపణలు చెప్పి అకౌంట్స్ డిలీట్ చేసుకున్నాడు. కామెడియన్ ప్రణిత్ మోరే కూడా నేను అక్కడ నవ్వకుండా అతడిని నిలదీయాల్సింది, నాది తప్పే అని సారీ చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. భారీగా నెగెటివిటీ రావడంతో ఏకంగా 38 లక్షల ఫాలోవర్స్ ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే అతడు డీయాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. రూ. 370 బిర్యానీ బిల్లుతో మొదలైన ఈ రచ్చ.. ఇప్పుడు మహిళల భద్రత, సోషల్ మీడియా అవేర్‌నెస్ లిమిట్స్ ఎంటనే పెద్ద చర్చకు దారితీసింది.