జపాన్‎లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‎లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

టోక్యో: జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత  7.1గా నమోదైంది. భూకంప కేంద్రం సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది.

భూ ప్రకంపనలతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాలు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి భారీ భవనాలు వణికిపోయాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

భూకంప ప్రభావంతో ఒక మీటరు ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించారు. క్యుషు ద్వీపంలోని నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రాంతాలకు ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది. 

భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి తక్షణ నివేదికలు ఏవీ లేవు. భూకంప ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టారు. కాగా, జపాన్‎లో వారంలోనే ఇది రెండో భూకంపం. జులై 25న ఉత్తర జపాన్‌లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.