చెన్నై: నెలల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా ఆధార్డ్ ఇవ్వడం లేదని మనస్థాపంతో ఓ వ్యక్తి ఏకంగా కలెక్టరేట్లోనే ఆత్మహత్యయత్నానికి పాల్పడటం తీవ్ర కలకం రేపింది. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమైన ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. ఈరోడ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (జులై 27) ఓ 74 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
వెంట తెచ్చుకున్న కిరోసిన్ మీద పోసుకుని నిప్పంటించుకుని కలెక్టర్ కార్యాయలంలోకి దూసుకెళ్లుందుకు ప్రయత్నించాడు. ఈ ఊహించని ఘటనతో దిగ్భ్రాంతికి గురైన కలెక్టరేట్ భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని వృద్ధుడిని రక్షించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడిని ఈరోడ్‌లోని పెరియార్ నగర్, పొయెరికరై ప్రాంతానికి చెందిన మురుగన్ (74)గా గుర్తించారు.
ఆధార్ కార్డు కోసం గత కొన్ని రోజులుగా సంబంధిత కార్యాలయానికి తిరుగుతున్నానని.. అయినప్పటికీ తనకు ఆధార్ కార్డు ఇవ్వలేదని పోలీసుల ఎదుట బాధితుడు వాపోయాడు. నెలల తరబడి తిప్పించుకుంటూ అధికారులు తనను వేధిస్తుండటంతోనే కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నిప్పంటించుకోవడానికి ప్రయత్నించానని తెలిపాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆధార్ కార్డ్ కోసం 74 ఏళ్ల వృద్ధుడు కలెక్టరేట్లో సూసైడ్ అటెంప్ట్ చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
