గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్‌లో జూలై 27, 2026న ఈ ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్‌డేట్ వెలువడింది. ప్రముఖ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ సర్జరీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయిందని ‘పెద్ది’ చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఫిజియోథెరపీ అవసరమని వైద్య బృందం సూచించినట్లుగా తెలిపింది.
గాయంతోనే షూటింగ్ కొనసాగించిన చరణ్..
‘పెద్ది’ షూటింగ్ సమయంలో రియల్ పహిల్వాన్లతో రామ్ చరణ్ కుస్తీ, యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే చరణ్ కుడి చేతి మణికట్టుకు తీవ్ర గాయమైందని నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే సినిమా షూటింగ్, ప్రమోషన్ కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ అప్పట్లో చికిత్సను వాయిదా వేసుకున్నారని.. ఇది చరణ్ తన వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో షూటింగ్‌ను కొనసాగించారని వెల్లడించింది.
రామ్ చరణ్‌లోని అభిరుచి, పట్టుదల, వృత్తిపట్ల నిబద్ధత మొత్తం చిత్ర బృందానికి స్ఫూర్తినిచ్చాయని వృద్ధి సినిమాస్ పేర్కొంది. కష్టమైన పరిస్థితుల్లోనూ ఆయన చూపించిన ప్రొఫెషనలిజం ప్రశంసనీయమని తెలిపింది.
A fighter on and off the screen ❤️
— Vriddhi Cinemas (@vriddhicinemas) July 28, 2026
Wishing our beloved Mega Power Star @AlwaysRamCharan Garu a smooth and speedy recovery. pic.twitter.com/7hmeyE0QLm
8 వారాల విశ్రాంతి.. ఫిజియోథెరపీ అవసరం..
సర్జరీ అనంతరం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గంగా హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. రామ్ చరణ్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవడంతో పాటు ప్రత్యేక ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ చికిత్సలు అవసరమని వైద్యులు సూచించారు.
వైద్య బృందంతో చరణ్ ఫోటో వైరల్
గంగా హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికాలోని మియామికి చెందిన ప్రముఖ హ్యాండ్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌తో పాటు ఇతర వైద్య నిపుణులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. సర్జరీ అనంతరం వైద్య బృందంతో కలిసి రామ్ చరణ్ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్ చరణ్ త్వరగా కోలుకుని తిరిగి పూర్తి ఆరోగ్యంతో రావాలని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు.
#RamCharan had his Wrist Surgery Done under the Expert Team of Doctors Yesterday in Coimbatore.
— Trends RamCharan ™ (@TweetRamCharan) July 28, 2026
He has been advised a minimum 8 weeks of rest with physiotherapy for complete recovery 🙏🏻
Get Well Soon & Get Back into Action Dear @AlwaysRamCharan Anna! ❤️ pic.twitter.com/JBFyz5YxvM
