Virat Kohli And Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ లార్డ్స్ వేదికగా అద్భుతమైన సెంచరీ కొట్టగా, విరాట్ కోహ్లీ రెండు అర్ధ సెంచరీలతో రాణించాడు. దీంతో మాజీ క్రికెటర్, క్రికెట్ విశ్లేషకుడు దీప్ దాస్‌గుప్తా రోహిత్, కోహ్లీలకు కీలక సూచనలు చేశాడు. సిరీస్ ఆరంభమైన మొదటి మ్యాచ్ నుంచే వీరు చెలరేగాలని, ఫామ్‌లోకి రావడానికి 1-2 మ్యాచ్‌ల సమయం తీసుకోకూడదని స్పష్టం చేశాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా సపోర్ట్ స్టాఫ్ మైండ్ సెట్‌ను సిద్ధం చేయాలని సూచించాడు.
ఒకే ఫార్మాట్ ఆడటం వల్లే ఈ హైప్:
రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను తీసుకొస్తారంటూ జరుగుతున్న వార్తలపై కూడా దీప్ దాస్‌గుప్తా స్పందించాడు. రోహిత్, విరాట్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతుండటంతో ఇలాంటి చర్చలు విపరీతంగా జరుగుతున్నాయని తెలిపాడు. అన్ని ఫార్మాట్లు ఆడేటప్పుడు ఒక దాంట్లో విఫలమైనా మరొక దాంట్లో రన్స్ చేస్తే గత వైఫల్యాన్ని జనాలు మర్చిపోతారని, కానీ ఒక్క ఫార్మాటే ఆడుతున్నప్పుడు చివరి మ్యాచ్ ప్రదర్శనే అందరికీ గుర్తుండిపోతుందని వెల్లడించాడు.
జట్టులో స్థానంపై ప్రశ్నలు అనవసరం:
రోహిత్, కోహ్లీల జట్టులోని స్థానం గురించి పదే పదే చర్చించాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ దాస్‌గుప్తా స్పష్టం చేశాడు. నాలుగేళ్ల క్రితం వారు జట్టులో ఉంటారని ప్రతీ సిరీస్‌కు ముందు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయింది.. వారి ప్రదర్శనల ఆధారంగానే వారికి స్థానం దక్కిందని గుర్తు చేశాడు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఏమాత్రం మారలేదని, మూడేళ్ల క్రితం వారితో మేనేజ్‌మెంట్ ఎలాంటి సంభాషణ జరిపేదో, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగించాలని పేర్కొన్నాడు.
