రాజకీయాల వైపు క్యూ కడుతున్న హీరోలు.. ప్రజాసేవే లక్ష్యం అంటూ విశాల్ కామెంట్స్ !

రాజకీయాల వైపు క్యూ కడుతున్న హీరోలు.. ప్రజాసేవే లక్ష్యం అంటూ విశాల్ కామెంట్స్ !

తమిళనాడు రాజకీయాలు, సినీ పరిశ్రమకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ వంటి సినీ దిగ్గజాల తర్వాత తాజాగా దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో మరోసారి కోలీవుడ్‌లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పుడు అదే జాబితాలో యంగ్ హీరోస్ ధనుష్, లారెన్స్, విశాల్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 

రాజకీయాల్లోకి ఎంట్రీ?

లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో విశాల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు సినీ జీవితంలో ప్రజలు చూపించిన ప్రేమ, ఆదరణను తిరిగి సమాజానికి సేవ రూపంలో అందించాలనే సంకల్పం ఉందని ఆయన చెప్పారు. ఇన్నేళ్లుగా నటుడిగా మీరు ఇచ్చిన అభిమానానికి ప్రతిఫలం ఇవ్వాలి. ఇక నుంచి నా ప్రయాణం ఒక్కటే... సూటి మార్గంలోనే నడుస్తాను. ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవు. ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తాను అని విశాల్ చెప్పిన మాటలు రాజకీయ సంకేతాలుగా మారాయి.

ప్రజాసేవకు లారెన్స్, ధనుష్ రెడీ.?

విశాల్ నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించకపోయినా.. ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ధనుష్ కూడా రక్తదాన శిబిరంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాలపై ఊహాగానాలకు కారణమయ్యాయి. మరోవైపు రాఘవ లారెన్స్ కూడా గతంలో ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి వ్యక్తం చేశారు. దీంతో తమిళ సినీ హీరోలు ఒక్కొక్కరుగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే చర్చ మరింత జోరందుకుంది.

తొలి ప్రయత్నం విఫలం..

అయితే ఇది విశాల్‌కు రాజకీయాలపై మొదటి చర్చ కాదు. 2017లో ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నించినా నామినేషన్ తిరస్కరణతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అప్పట్లో దాన్ని ప్రజాస్వామ్యానికి అవమానం అంటూ విశాల్ తీవ్రంగా విమర్శించారు. అనంతరం రాజకీయ పార్టీ స్థాపిస్తున్నానన్న వార్తలను ఖండించిన ఆయన, తన లక్ష్యం ప్రజాసేవేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం విశాల్ 'దేవి ఫౌండేషన్' ద్వారా విద్యార్థులు, రైతులు, పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నారు. భవిష్యత్తులో ప్రజల కోసం అవసరమైతే మరింత ముందుకు వస్తానని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.