BYD పెట్రోల్ కమ్ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లొచ్చు

BYD పెట్రోల్ కమ్ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లొచ్చు

కార్ల మార్కెట్లో మైలేజ్ అంటేనే పడిచచ్చే ఇండియన్ కస్టమర్ల కోసం గ్లోబల్ ఈవీ దిగ్గజం బీవైడీ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అదే బీవైడీ ‘DM-i’ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్. సాధారణ హైబ్రిడ్ కార్లలా కాకుండా.. ఇది ఒక ‘ఎలక్ట్రిక్-ఫస్ట్’ ఈవీ కారు టెక్నాలజీ. అంటే ఈ కారు దాదాపు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తోనే నడుస్తుంది. పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌ల క్రేజీ కాంబినేషన్‌తో తయారైన ఈ టెక్నాలజీతో.. కారును ఒక్కసారి ఫుల్ ట్యాంక్, ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1,200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.

ఇంజన్ కేవలం జనరేటర్ మాత్రమే:

సాధారణ హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజన్ మెయిన్ రోల్ పోషిస్తే.. బీవైడీ DM-i టెక్నాలజీలో ఎలక్ట్రిక్ మోటార్ అరాచకం సృష్టిస్తుంది. ఇది ప్రధానంగా మూడు మోడ్స్‌లో పనిచేస్తుంది:
* EV మోడ్: సిటీలో తిరిగేటప్పుడు కారు పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. ఒక్క చుక్క పెట్రోల్ కూడా ఖర్చు కాదు.
* సిరీస్ హైబ్రిడ్ మోడ్: బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినప్పుడు లోపల ఉండే పెట్రోల్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. కానీ అది చక్రాలను తిప్పదు, కేవలం జనరేటర్‌లా పనిచేస్తూ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. కారు మాత్రం ఎలక్ట్రిక్ మోటార్‌తోనే ముందుకు వెళ్తుంది.
* ప్యారలల్ హైబ్రిడ్ మోడ్: హైవేలపై ఫుల్ స్పీడ్‌తో వెళ్లేటప్పుడు లేదా ఎక్కువ పవర్ కావాల్సి వచ్చినప్పుడు పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి చక్రాలను నడుపుతాయి.

అదిరిపోయే థర్మల్ ఎఫిషియెన్సీ..
ఈ టెక్నాలజీలో బీవైడీ తన పవర్‌ఫుల్ 1.5-లీటర్ ‘క్సియావోయున్’ పెట్రోల్ ఇంజన్‌ను వాడింది. దీని థర్మల్ ఎఫిషియెన్సీ ప్రపంచంలోనే అత్యుత్తమంగా 43.04 శాతంగా ఉంది. మైలేజ్ పరంగా చూస్తే.. NEDC టెస్టింగ్ ప్రకారం 100 కిలోమీటర్లకు కేవలం 4.8 లీటర్ల పెట్రోల్ వాడుతోంది. అంటే లీటరుకు దాదాపు 21 కి.మీ మైలేజ్ ఇస్తోందన్నమాట. మైలేజ్ మాత్రమే కాదు, స్పీడ్ విషయంలోనూ ఇది తోపు. కేవలం 5.5 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. పైగా నార్మల్ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఇందులో సౌండ్, వైబ్రేషన్స్ అస్సలు ఉండవు.

►ALSO READ | ఇథనాల్ బ్లెండింగ్‌పై మోడీ సర్కార్ యూటర్న్ తీసుకుంటోందా..? వాహనదారులకు కొత్త ఆఫర్..

బ్లేడ్ బ్యాటరీ సేఫ్టీ.. ఇండియన్ రోడ్లకు పర్ఫెక్ట్
ఈ పవర్‌ట్రెయిన్‌లో బీవైడీ తన ఐకానిక్ ‘బ్లేడ్ బ్యాటరీ’ టెక్నాలజీని ఉపయోగించింది. ఇది సేఫ్టీ, మన్నిక, థర్మల్ స్టెబిలిటీ విషయంలో నెంబర్ వన్. ఇండియాలో ఇంకా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి.. లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఈవీ కార్ల మజాను అందించడానికి ఈ DM-i టెక్నాలజీ పర్ఫెక్ట్ ఆప్షన్ అంటోంది చైనా ఈవీ దిగ్గజం బీవైడీ.

బీవైడీకి ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెగ్మెంట్‌లో 2008 నుండి భారీ అనుభవం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు పైగా ఇలాంటి కార్లను విక్రయించి, గ్లోబల్ మార్కెట్లో 35% పైగా వాటాను సొంతం చేసుకుంది. ఇండియాలో ఇప్పటికే 14వేల మంది కస్టమర్ల మైలురాయిని దాటిన బీవైడీ.. ఈ సరికొత్త టెక్నాలజీతో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌ను రూల్ చేయడానికి రెడీ అవుతోంది.