2014 మే 26న దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి నేటి వరకు, 12 ఏళ్లకు పైగా (4,398 రోజులకు పైగా) నిరంతరాయంగా దేశాన్ని నడిపించి, అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా అరుదైన మైలురాయిని మోదీ అధిగమించారు. సుదీర్ఘకాలం పాలించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ యుగం సగర్వంగా నిలిచింది. సామాన్య కార్యకర్త నుంచి గ్లోబల్ లీడర్‌గా ఎదిగిన ఆయన, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’, ‘నేషన్ ఫస్ట్’ సంకల్పంతో పాలన సాగించారు. రాజకీయ స్థిరత్వంతో దేశాన్ని ప్రపంచంలోనే 11వ స్థానం నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదపడ్డారు.
నా టి నెహ్రూ సోషలిజం, ఇందిరా గాంధీ సంక్షేమ ధోరణి అయితే, మోదీ పాలన దేశ ఎకానమీ గ్రోత్‌కు నిదర్శనంగా నిలబడింది. మోదీ మూడుసార్లు అధికారం చేపట్టడమే ఆయన పాలన పట్ల ప్రజల ఆమోదనీయతను తెలియజేస్తోంది. దశాబ్దాలుగా నలిగిన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి సంక్లిష్ట సమస్యలను శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చట్టబద్ధంగా పరిష్కరించి పీఎం మోదీ తన వ్యూహాత్మక పటిమను చాటుకున్నారు.
ఒకే దేశం - ఒకే పన్ను
ఆర్టికల్ 370 రద్దు సమయంలో కమ్యూనికేషన్ బంద్, స్థానిక నాయకుల గృహ నిర్బంధాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవగా.. వాటిని సున్నితంగా పరిష్కరించారు. ఇదే క్రమంలో బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ను తీసుకురావడంపై న్యాయ వర్గాల్లో భిన్న వాదనలు వ్యక్తమయ్యాయి. ఆర్థికరంగంలో సంక్లిష్ట పన్నుల స్థానంలో ‘ఒకే దేశం - ఒకే పన్ను’ (జీఎస్టీ) విధానాన్ని తెచ్చి, జన్ ధన్- ఆధార్- మొబైల్ (జేఏఎం) త్రిమూర్తి అనుసంధానంతో మధ్యవర్తుల అవినీతిని తొలగించి, భారతదేశాన్ని యూపీఐ ఆధారిత డిజిటల్ సూపర్ పవర్‌గా నిలిపారు.
కానీ, ఈ ఆర్థిక సంస్కరణల వెనుక 2016 నాటి పెద్దనోట్ల రద్దు తీవ్ర సామాజిక దుమారాన్ని లేపింది. ఇది దేశాన్ని డిజిటలైజేషన్ వైపు నడిపించినప్పటికీ, నాడు సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర నగదు కొరతతో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ భారత్ ప్రపంచంలో డిజిటల్ పవర్‌గా ఎదిగింది. ఆర్థిక వృద్ధి సాధించిన డిజిటల్, పన్ను ఆదాయాలు, మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సంక్షేమానికి ఇంధనంగా మారాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణ వేగాన్ని మూడు రెట్లు పెంచడం, పూర్తి స్వదేశీ సాంకేతికతతో కూడిన 'వందే భారత్' రైళ్లను ప్రవేశపెట్టడం, 'ఉడాన్' పథకం ద్వారా ప్రాంతీయ నగరాలకు విమానయానాన్ని చేరువ చేయడం వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సంక్షేమ రంగంలో కేవలం నినాదాలకే పరిమితం కాకుండా 100 శాతం లబ్ధి సూత్రంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రూ. 5 లక్షల ఉచిత వైద్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు (ఉజ్వల), జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్ల ఇళ్లకు తాగునీరు అందించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు.
ఒకవైపు సంక్షేమం సాగుతుండగా, దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ, రక్షణ రంగాల్లో స్వయంసమృద్ధి (ఆత్మనిర్భరత) కోసం కృషి చేసారు. వ్యవసాయ రంగంలో 'పీఎం -కిసాన్ సమ్మాన్ నిధి' ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ, 'వేపపూత యూరియా' విధానంతో ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ కాలం పాటు చారిత్రాత్మక ఆందోళనలు చేశారు. ప్రజాస్వామ్య పంథాలో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ మోదీ ప్రభుత్వం చివరకు ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి రావడం మోదీ పాలనలో ఒక పెద్ద రాజకీయ సవాలుగా నిలిచింది.
మేక్ ఇన్ ఇండియా
రక్షణ రంగంలో సరిహద్దు దాటి జరిపిన సర్జికల్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు పంపుతూనే.. 'మేక్ ఇన్ ఇండియా' ద్వారా స్వదేశీ యుద్ధ విమానాలు, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి నౌకలను నిర్మించి, భారతదేశాన్ని రక్షణ దిగుమతుల దేశం నుంచి ఎగుమతుల స్థాయికి చేర్చారు. రక్షణ, ఆర్థికరంగాల్లో పెరిగిన ఈ అంతర్గత బలం అంతర్జాతీయ వేదికలపై భారత్ కీర్తిని పెంచింది. విదేశాంగ విధానంలో నెహ్రూ నాటి అలీన విధానాన్ని ‘మల్టీ- అలైన్‌మెంట్’గా మార్చి, దేశ ప్రయోజనాలే పరమావధిగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రష్యా నుంచి చౌకగా ముడి చమురు దిగుమతి చేసుకుని 'విశ్వమిత్ర'గా గుర్తింపు తెచ్చారు. జీ20 సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్ దేశాలకు బలమైన ప్రతినిధిగా భారత్‌ను నిలిపారు.
ఇక శతాబ్దపు అతిపెద్ద సంక్షోభమైన కొవిడ్-19 సమయంలో వలస కార్మికుల సమస్యలు, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లు ఎదురైనా.. 200 కోట్లకు పైగా స్వదేశీ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించి దేశాన్ని గట్టెక్కించారు. 'ఆపరేషన్ గంగ' ద్వారా ఉక్రెయిన్ సంక్షోభం నుంచి 20 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులను సురక్షితంగా రక్షించి విదేశాంగ నీతిలో చురుకైన సంక్షోభ నిర్వహణ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
దేశ నిర్మాణానికి పటిష్ట పునాది
దేశ నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయం (అప్పులు), అంతర్జాతీయ యుద్ధాల వల్ల తలెత్తే ధరల హెచ్చు తగ్గులు తాత్కాలిక సవాళ్లుగా నిలిచాయి. అయితే, నిరంతరాయంగా రెండుసార్లు పూర్తి మెజారిటీతో పాలించినప్పటికీ, 2024 ఎన్నికల అనంతరం కూటమి (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలను సమతుల్యంగా కలుపుకుంటూ సాగుతున్న ప్రస్తుత పరిపాలన మోదీ నాయకత్వంలో సరికొత్త రాజకీయ వ్యూహాత్మక ధోరణి కనిపించింది.
భారతదేశ చరిత్రలో నెహ్రూ శకం దేశానికి బలమైన పునాది వేస్తే, ఇందిర శకం సార్వభౌమత్వాన్ని చాటింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఈ పుష్కర కాల పాలన తీవ్రమైన సంస్కరణలు, వివాదాలు, అంతర్లీన సవాళ్లను అధిగమిస్తూ సాగింది. త్వరలోనే భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా, 2047 నాటికి సంపూర్ణ అభివృద్ధి చెందిన ‘వికసిత్ భారత్’
నిర్మాణానికి 12 ఏళ్లలో మోదీ బలమైన పునాదులే వేశారని చెప్పాలి.
- పరమేశ్వర్ నాగిరెడ్డిపల్లి
సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
